కొన్నాళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు కొణతాల రామకృష్ణ! ఈ మధ్య ఆయన వార్తల్లో కూడా లేరు. ఇన్నాళ్ల తరువాత ప్రత్యేక హోదాపై ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతూ వార్తల్లోకి వస్తున్నారు. ఈనెల 9న అనకాపల్లిలో చాయ్ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రత్యేక హోదాపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు టీ దుకాణాల్లో చర్చ పెట్టాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్రలోని పట్టణాలూ పల్లెల్లో ఈ చర్చా కార్యక్రమం ఉంటుందని ఇటీవలే కొణతాల ప్రకటించారు. అయితే, ఇంతకీ ఈ చర్చా కార్యక్రమం కేవలం ప్రజల అవగాహ కోసమేనా.. లేదా, రాజకీయంగా దీన్నుంచి కొణతాల ఏదైనా ఆశిస్తున్నారా అనేది ప్రశ్న..? ఇంతకీ, కొణతాల ఏ పార్టీ తరఫున ఈ చర్చ చేపడుతున్నట్టు… తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానా, వైకాపాకి మద్దతుగానా, జనసేనకు తోడుగానా..? భాజపా నిర్ణయానికి ఖండనగానా..?
నిజానికి, ప్రస్తుతం ఏ పార్టీకి చెందని నాయకుడిగా మిగిలిపోయారు కొణతాల. వైయస్ హయాంలో ఆయనకు వీరాభిమానిగా ఉండేవారు. తరువాత, జగన్ వెంట వెన్నుదన్ను కూడా నిలబడ్డారు. వైకాపా నుంచి ఎంతమంది బయటకి వెళ్లిపోతున్నా… చివరివరకూ ఉండేది కొణతాల అనుకున్నారు! కానీ, అనూహ్యంగా జగన్‌కి కూడా దూరమయ్యారు. ఆ తరువాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నారు. అధికార పార్టీ తెలుగుదేశంలో చేరేందుకు పావులు కదిపారు. కానీ, వర్కౌట్ కాలేదు! అధిష్ఠానం నుంచి పచ్చతీర్థం ఇచ్చేందుకు పచ్చ సిగ్నల్ పడినా… దేశం పార్టీలో ఉన్న కొంతమంది వ్యతిరేకించడంతో కొణతాల చేరిక ఆగిపోయింది. కాస్త క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు కాబట్టి, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటే బాగుంటుందని యువనేత నారా లోకేష్ భావించినా, ఆయన చేరిక కుదరలేదు! ఇప్పట్లో కూడా కుదిరే వాతావరణం కనిపించడం లేదు. ఎందుకంటే, ఇప్పటికే అనకాపల్లి ఎంపీ సీటుపై ఇంకో నేత కన్నేశారు. ఇప్పట్నుంచే నియోజక వర్గాల్లో క్రియాశీలంగా ఉంటున్నారు. ఇక, సిట్టింగ్ తెలుగుదేశం ఎమ్మెల్యేని కాదని కొణతాలకు సీటిచ్చే పరిస్థితి ఉండదు. సో.. కొణతాల టీడీపీలో చేరడం సాధ్యం కాదనే అనిపిస్తోంది.
దీంతో కొణతాల రాజకీయ భవిష్యత్తు ఇంకా డోలయామానంలోనే ఉంది! పోనీ, భాజపాలో చేరే అవకాశం ఉందంటే… ఆ పార్టీ కూడా ఇన్ డైరెక్ట్ గా తెలుగుదేశంతో సంబంధాలు ఉన్నదే కదా! ఇక, జనసేన వైపు చూద్దామంటే… గతవైభవం చూసిన అనుభవం ఉంది. అంతా ఒక్క పవన్ కల్యాణ్ చుట్టూనే తిరుగుతోంది. ఇంతవరకూ ఒక వ్యవస్థ అంటూ ఆ పార్టీలో లేదు. ఇక, జరిగిందేదో జరిగిందని వైకాపాలోకి వెళ్దామనుకున్నా… కొణతాల రాకను జగన్ స్వాగతిస్తారన్న గ్యారంటీ లేదు! మొత్తానికి… కొణతాల రాజకీయ ప్రయాణం ఏ పార్టీవైపు అనేది ప్రస్తుతానికి సందిగ్ధంలో ఉందని చెప్పాలి. మరి, ఈ విషయంపై ఒక స్పష్టత లేకుండా ప్రత్యేక హోదాపై కొత్త తరహా ఉద్యమం ద్వారా కొణతాల ఆశిస్తున్నది ఏంటి..?