జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన పోలవరం ప్రాజెక్టు నిజానికి తెదేపా ప్రభుత్వానికి సమస్య కానే కాకూడదు కానీ ప్రత్యేక హోదాలాగే అది కూడా ఓ ప్రత్యేక సమస్యగా తయారయింది. దాని వలన మిత్ర పక్షం, ప్రతిపక్షం ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను ఎదుర్కోక తప్పడం లేదు.
జగన్మోహన్ రెడ్డి దీని గురించి ఏమంటున్నారంటే… “పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి శ్రద్ధ చూపకుండా, తెదేపా నేతలకు, కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును మొదలుపెట్టింది. నీటిని నిలువ చేసుకొనే సౌకర్యం కూడా లేని మొట్ట మొదటి ప్రాజెక్టు దేశంలో ఇదే. అది కూడా గోదావరి నదిలో భారీగా నీళ్ళు పొంగి ప్రవహిస్తున్నపుడు మాత్రమే ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పుకొంటోంది. దాని కోసం సుమారు రెండు వేల కోట్ల ప్రజాధనం వృధా చేసింది. పట్టిసీమ ద్వారా రాయలసీమకు ఏవిధంగా నీళ్ళు అందిస్తారో ఎవరికీ తెలియదు. ఈ ప్రాజెక్టుని పోలవరం ప్రాజెక్టు లో భాగమని మంత్రి అంటే, కాదని ముఖ్యమంత్రి అంటారు. తెదేపా ప్రభుత్వం పోలవరాన్ని అటకెక్కించేందుకే పట్టిసీమను మొదలుపెట్టినట్లుంది. పోలవరం గురించి కేంద్రాన్ని గట్టిగా అడగదు..కనీసం పొరుగు రాష్ట్రమయిన తెలంగాణా ప్రభుత్వంతో కూడా దీని గురించి దైర్యంగా మాట్లాడలేదు,” అని అన్నారు.
మిత్రపక్షానికి చెందిన పురందేశ్వరి దీని గురించి ఏమంటున్నారంటే.. “ఈ ప్రాజెక్టులో పట్టిసీమను అంతర్భాగంగా చేర్చడం వలననే సమస్యలు మొదలయ్యాయి. పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమ అంతర్భాగమా కాదా అనే విషయంలో రాష్ట్ర మంత్రులకే సరయిన అవగాహన లేదు. ఒకరు ఔనంటారు మరొకరు కాదంటారు. ఇది పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు తాత్కాలికంగా మూడేళ్ళ కోసమే పట్టిసీమ ప్రాజెక్టుని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి అంటారు. పట్టిసీమలో ఉపయోగిస్తున్న పంపులను అవసరమయినప్పుడు వేరే ప్రాజెక్టులో ఉపయోగించుకొంటామని చెపుతుంటారు. అంటే పట్టిసీమ పోలవరంలో అంతర్భాగం కాదని భావించవలసి ఉంటుంది. కానీ పట్టిసీమ పనులకు కూడా పోలవరం ప్రాజెక్టు పనులుగా చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి బిల్లులను పంపించింది. సహజంగానే సంబంధిత శాఖ అధికారులు అందుకు అభ్యంతరం చెపుతున్నారు.”
“ఇంక మరో విషయం ఏమిటంటే పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రూ.16, 000 కోట్ల నుంచి ఏకంగా 32, 000 కోట్లకు పెంచేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షించడానికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలవరం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అధారిటీ నుంచి దీని కోసం అనుమతి తీసుకోలేదు కనీసం దానికి తెలియజేయలేదు కూడా. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినట్లు చెపుతున్న రూ.850 కోట్లకు లెక్కలు చెప్పడం లేదు. నిర్వాసితుల కోసం ఏమి చేసిందో కూడా చెప్పడం లేదు. అటువంటప్పుడు మళ్ళీ కొత్తగా నిధులు మంజూరు చేయాలని ఏవిధంగా ఆశించగలము? ఈ కారణాల చేతనే పోలవరం ప్రాజెక్టులో ఆలస్యం జరుగుతోంది. కేంద్ర జలవనరుల శాఖ అడిగిన అన్ని ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సరయిన సమాధానాలు చెప్పి లెక్కలు అప్పజెప్పినట్లయితే నిధుల మంజూరుకి ఆలస్యం ఉండదని నేను హామీ ఇవ్వగలను,” అని అన్నారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దీని గురించి ఏమన్నారంటే… “పోలవరం ప్రాజెక్టు క్రింద ముంపుకు గురవుతాయనే కారణం చేత ఖమ్మం జిల్లాకి చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేసారు. మళ్ళీ వాటిని తిరిగి తెలంగాణా రాష్ట్రానికి బదిలీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారు,” అని చెప్పారు.
ముంపుకు గురయ్యే ఆ మండలాలను తిరిగి తెలంగాణాకి ఇచ్చేయడం అంటే అర్ధం పోలవరం ప్రాజెక్టు నిర్మించే అవకాశాలు లేవని పరోక్షంగా చెపుతున్నట్లే భావించాల్సి ఉంటుంది.
ఇంకా ఛత్తీస్ ఘడ్, ఓడిశా రాష్ట్రాలు పోలవరంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. వాటితో ఇంతవరకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడిన దాఖలాలు లేవు. ఈవిధంగా పోలవరం ప్రాజెక్టుపై అనేక ప్రశ్నలే వినిపిస్తున్నాయి తప్ప పురోగతి కనిపించడం లేదు. అందుకు కేంద్రాన్ని నిలదీయవలసి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం సంజాయిషీలు ఇచ్చుకోవలసి వస్తోంది.