పదవుల కోసం నేతలు న్యాయస్థానాలను, వ్యవస్థలను తప్పుదోవ పట్టిస్తూనే ఉన్నారు. తీరా అంతా బయటపడ్డాక మెల్లగా తప్పు జరిగిపోయిందని అంగీకరిస్తున్నారు. ఇది పరిపాటిగా కొనసాగుతోంది. న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తూ,తీర్పులను సవాల్ చేస్తూ పదవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం వ్యవహారంలో కోర్టు తీర్పు తర్వాత మరోసారి ఈ అంశంపై చర్చ మొదలైంది.
చెన్నమనేని భారతీయుడు కాదని, ఆయన జర్మనీ పౌరుడు అని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ పదిహేనేళ్లుగా న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. తను ఈ దేశ పౌరుడినే అంటూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించి, పదేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగారు చెన్నమనేని. ఈ నేపథ్యంలోనే డాక్యుమెంట్లను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు… ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇదివరకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా సమర్థించింది.
ఆయన భారతీయుడు కాదని తేల్చిచెప్పింది. చెన్నమనేనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 30లక్షల జరిమానా విధించింది. ఇందులో పిటిషనర్ ఆది శ్రీనివాస్ కు 25 లక్షలు , లీగల్ సర్వీసెస్ కమిటీకి 5లక్షలు చెల్లించాలని ఆదేశించింది. న్యాయస్థానం తీర్పుపై అప్పీల్ చేయకుండా తన తప్పును ఒప్పుకుని చెన్నమనేని రమేశ్ 30 లక్షల ఫైన్ చెల్లించారు. కానీ ,పదిహేనేళ్ళ ఆలస్యం ఖరీదు 30లక్షలేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
చెన్నమనేని తన తప్పును అంగీకరించి ఉంటే , ఆయనపై ఎప్పుడో అనర్హత వేటు పడేది.ఆయన ప్రత్యర్ధి ఎన్నికల్లో రెండో స్థానంలో నిల్చిన ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యేగా ప్రకటించబడేవాడు. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యే అయి ఉంటే ఇప్పుడు ఈజీగా మంత్రి అయ్యేవాడు. కానీ, ఆయన 15ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. హైకోర్టు తాజా తీర్పుతో న్యాయం గెలిచింది కానీ, ఆలస్యం ఖరీదు 30 లక్షలేనా? అనే వాదనలు వినిపిస్తున్నాయి.