మన దగ్గర ఉన్న వ్యవస్థలన్నీ కూడా సర్వాధికారాలు గుప్పిట పట్టి ఉన్నవాడి చేతిలో నాట్యం చేస్తూ ఉంటాయి. ఆ అధికారాలు గుప్పిటపట్టిన వాడు రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీలు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదుగా. నీతి నియమాలు అనేవి నిఘంటువులోనే లేని వ్యక్తులు ఆ రాజకీయాల్లో బాగా పవర్‌ఫుల్‌గా ఉన్నారు. స్వార్థం, ఆశ్రిత పక్షపాతం, కోపతాపాలు….ఇంకా మనుషులకు జంతువులకు ఉండే ఎన్నో అవలక్షణాలు వాళ్ళ సొంతం. అందుకే ఆ నాయకులే ఒకరినొకరు జంతువులతో పోల్చుకుంటూ ఉంటారు. మొత్తంగా రాజకీయాలను కంపు కంపు చేసేశారు. కాస్త విషయమున్నవాడు, విలువలు ఉన్నవాడెవ్వడూ కూడా అటువైపు తొంగిచూడడానికి భయపడేలా చేయడంలో మన నాయకులు అద్వితీయ విజయం సాధించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచీ ఇప్పటి వరకూ కూడా మన నాయకులు సాధించిన అద్భుతమైన విజయం ఏదైనా ఉంది అంటే అది ఇదే.
ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు అని చెప్పి ఒక నియోజకవర్గంలో జరగాల్సిన ఉప ఎన్నికను రద్దు చేసింది ఎన్నికల కమిషన్. ఈ వార్తను ఎలా తీసుకోవాలి? నోట్ల పంపకం లేకుండా ఎన్నికలు జరగాలని ఎన్నికల కమిషన్ కంకణం కట్టుకుందని నమ్మాలా? మరి అలా అయితే గెలవడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సివచ్చిందో మీడియా కెమేరాల సాక్షిగా అసలు సత్యం బయటపెట్టిన స్పీకర్ పైన ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? బ్రీఫ్డ్ మీ అంటూ దేశం మొత్తం పాపులర్ అయిన ఓటుకు కోట్లు కేసు విషయం ఎన్నికల కమిషన్‌కి తెలియదా? గత కొన్ని దశాబ్ధాలుగా ఓటర్లకు డబ్బులు పంచకుండా జరిగిన ఎన్నికలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇక్కడ ఎవరికో నష్టం చేయాలన్న ఉద్ధేశ్యంతో వేరెవరో వ్యవస్థలను మేనేజ్ చేశారంటే నమ్మకుండా ఉండడం ఎలా? కాకపోతే మనం ఆనందపడాల్సిన విషయం ఒక్కటే. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఒక్కొక్క టెర్మ్‌కి కొంతమంది అయినా అవినీతిపరులైన నాయకులు జైలు బాట పడుతూ ఉంటే భవిష్యత్‌పైన కాస్త ఆశలు పెట్టుకోవచ్చన్న ఆశ. ఈ వ్యవస్థలను మేనేజ్ చేసే విషయంలో క్విడ్ ప్రో ఖో వ్యవహారాలు మామూలుగా నడవవు. మనం మనం బరంపురం అనే తరహాలో ఉంటుంది వ్యవహారం.
ఇక దేశంలో ఉన్న వ్యాపారస్థులందరూ కూడా ఇండియాలో రాజకీయ వ్యాపారంలో వచ్చే లాభాలు ఇంకే వ్యాపారంలోనూ రావని తెలుసుకొని…పెజా సేవ చేయాలన్న కసిని పెంచుకుని పాలిటిక్స్ వైపు నడిచినప్పటి నుంచీ ఏది క్విడ్ ప్రో ఖోనో, ఏది కాదో కూడా చెప్పలేని పరిస్థితి. నేను తప్ప ఆంధ్రప్రదేశ్‌కి దిక్కులేదు అని ఎపి ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టిన ఒక నోరు పెద్ద నాయకుడి స్వచ్ఛంధ సంస్థలో ఏదో గోల్ మాల్ జరిగిందని సమాచారం బయటికి వచ్చింది. అసలు ఈ న్యూస్‌లో కొత్తగా తెలుసుకోవాల్సింది ఏముంది? తెలియని విషయం ఏముంది? ముఖ్యమంత్రుల కొడుకులు, కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలలో వ్యాపారాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అధికారంలో ఉన్నవాడికి జీ హుజూర్ అనే వ్యవస్థ మనది. అలా అనకపోతే కమిషనర్ స్థాయి వ్యక్తిని కూడా పబ్లిక్‌గా బెదిరించగలరు, భయపెట్టగలరు. అలాంటి నేపథ్యంలో అధికారంలో ఉన్న వాళ్ళ సొంత మనుషుల స్వచ్ఛంధ సంస్థలు, వ్యాపారాలలో జరిగే అక్రమాలను అడ్డుకునే సత్తా ఎవరికి ఉంటుంది? అయ్యా ఎస్…అనే ఐఎఎస్‌లకు మాత్రమే అన్ని సౌకర్యాలు, కోరుకున్న పోస్టింగ్‌లు ఇచ్చే వ్యవస్థ మనది. ఇదంతా అందరికీ తెలిసి జరిగే క్విడ్ ప్రో ఖో వ్యవహారమే. అలా నాయకులందరూ కూడా మూకుమ్మడిగా దోచుకోవడానికి ఓ వ్యవస్థను ఏర్పరుచుకున్నారు. అవినీతి, అక్రమ సొమ్ముకు తోడు అధికారికంగా ప్రజల నుంచి వసూలు చేసిన ట్యాక్స్‌ల సొమ్ముతో జీతభత్యాలు, సౌకర్యాలు కూడా గట్టిగానే ఏర్పరుచుకున్నారు. ఎప్పుడైనా దొంగలకు దొంగలకు మధ్య తేడాలు వస్తే మాత్రం ఎక్కువ పవర్‌ని చేత పట్టిన దొంగ తక్కువ పవర్ ఉన్న దొంగను శిక్షిస్తూ ఉంటాడు. ఇంతోటి దానికి ఏదో ఒక అవినీతి వ్యవహారంలో శిక్షలు పడగానే వ్యవస్థ మొత్తం బాగుపడిపోయే రోజులు వచ్చేశాయి అని భజన మీడియా రాసే రాతల్లో మాత్రం కామెడీ మామూలుగా ఉండదు.