1989లో సిమెంట్ పైపులు తయారు చేసే కంపెనీ మేఘా ఎంటర్ ప్రైజేస్. పి. పిచ్చిరెడ్డి దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఆ కంపెనీ రాజకీయ పార్టీలకు రెండున్నర వేల కోట్ల విరాళాలు ఇచ్చే స్థాయికి ఎదిగింది. అంత డబ్బు ఎలా వచ్చింది… ఎంత లాభం వస్తే అంత విరాళాలు ఇవ్వాలి .. అనే సందేహాలు చాలా వస్తాయి. మూడు దశాబ్దాల్లోనే ఇంత అసాధారణంగా ఎదగడం వెనుక.. భారీ క్విడ్ ప్రో కో కథలు ఉన్నాయని.. ఎలక్టోరల్ బాండ్లతో వెలుగులోకి వచ్చిన విషయాలు నిరూపిస్తున్నాయి.
పిచ్చిరెడ్డి .. సిమెంట్ పైపుల తయారీ కంపెనీని ప్రారంభిచిన తర్వాత.. ఆయన కుమార్తె సుధారెడ్డిని కృష్ణారెడ్డి పెళ్లి చేసుకున్నారు. ఆ సంస్థలోకి కృష్ణారెడ్డి వచ్చారు. అక్కడ్నుంచే దశ తిరగింది. ప్రభుత్వాల నుంచి కాంట్రాక్టులు రావడం ప్రారంభమయ్యాయి. కమిషన్లు ఇచ్చి మిగతా పనులు పూర్తి చేసుకునేవారని.. ఎలక్టోరల్ బాండ్లు నిరూపిస్తున్నాయి. అధికారంలో ఉన్న ప్రతీ పార్టీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి.
ముఖ్యంగా మేఘా గత పదేళ్లలో అసాధారణంగా ఎదిగింది. తెలంగాణలో ప్రాజెక్టులు.. ఆయనకు కల్పవృక్షణంలా మారాయి. తెలంగాణ ప్రజల నెత్తిన లక్ష కోట్లకుపైగా పెట్టిన అప్పులో.. అత్యధిక నిధులు ఆయన ఖాతాలోనే పడ్డాయని చెబుతున్నారు. అదొక్కటే కాదు మేజర్ ప్రాజెక్టులన్నీ ఆయనవే. హైదరాబాద్ లో తిరిగే ఎలక్ట్రిక్ బస్సులన్నీ మేఘావే. ఇక జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏపీ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఏ పని అయినా మేఘాదే. అయితే మేఘా కృష్ణారెడ్డి తన తెలివి తేటల్ని రాష్ట్రాలకే కాదు.. జాతీయస్థాయికీ తీసుకెళ్లారు. బీజేపీనీ మచ్చిక చేసుకున్నారు.
మేఘా కంపెనీ పోలవరంలో చేపట్టిన పనులు నాసిరకంగా మారాయి. ఇప్పుడు అధికార పార్టీలు మారినా… ఆయనకు కష్టాలొస్తాయని ఎవరూ అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన చేతిలో మీడియా కూడా ఉంది. ఎన్టీవీ, టీవీ9లలో వాటాలు కొన్నారు. కావాలంటే వచ్చే పార్టీకి విరాళాలిస్తారు. ఇలాంటి కాంట్రాక్టర్లు ఉంటే… రాజకీయ పార్టీలకు కూడా కావాల్సిందేముంటుంది.