రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తోంది. ఏపీ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య పేరును ఖరారు చేశారు. వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆయన బీజేపీతో ఒప్పందం చేసుకునే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ఆర్.కృష్ణయ్య ఇప్పటి వరకూ బీజేపీలో చేరలేదు. ఆయన రేపు బీజేపీ తరపున నామినేషన్ వేయనున్నారు. బీసీ సంక్షేమ సంఘం పేరుతో ఉద్యమాలు ప్రారంభించిన ఆయన తర్వాత టీడీపీ, కాంగ్రెస్, వైసీపీల మీదుగా బీజేపీలో చేరారు. ఆయన పదవి కాలం మరో నాలుగేళ్లు ఉంటుది.
టీడీపీ తరపున బీద మస్తాన్ రావు, సానా సతీష్ పేర్లు ఖరారరయ్యాయి. అధికారిక ప్రకటన చేయలేదు కానీ వారు రేపు చంద్రబాబు వద్ద నుంచి బీఫామ్స్ తీసుకుని నామినేషన్ వేయనున్నారు. మూడు సీట్లకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ముగ్గురు నామినేషన్లు దాఖలు చేస్తారు కాబట్టి అంతా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఓ సీటును జనసేనకు కేటాయిస్తారని అనుకున్నా ఇవి ఉపఎన్నికలు కావడం.. రాజీనామాలు చేసిన వాళ్లకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించడంతో జనసేనకు అవకాశం లేకుండా పోయింది.
పవన్ కల్యాణ్ తన సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును ఎంపీ చేయాలని అనుకుంటున్నారు. ఆయన కూటమి కోసం అనకాపల్లి ఎంపీ సీటును కూడా త్యాగం చేశారు. అయితే రాజ్యసభ పదవి విరమణల కాలంగా వచ్చే ద్వైవార్షిక ఎన్నికల్లో ఆయనకు ఖచ్చితంగా చాన్స్ వస్తుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు రాజీనామా చేసిన సీటు కాబట్టి బీజేపీకి ఇచ్చారని ఈ సారి అలాంటి అవకాశం ఉండదని అంటున్నారు.