బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య.. ఈ సారి ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యారు. సీపీఎం నేతృత్వంలోని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యను ప్రకటిస్తామని.. తమ్మినేని వీరభద్రం కొద్ది రోజుల కిందట ప్రకటించారు. ఆయనకు మెల్లగా ఇతర పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. ఆర్.కృష్ణయ్యను ఏ పార్టీ ప్రకటించినా తమ పార్టీ ఆయనకు సంపూర్ణ మద్దతు ఇస్తుందని శివసేన పార్టీ తెలంగాణ శాఖ ప్రకటించింది. మరికొన్ని బీసీ సంఘాలు కూడా.. మద్దతు ప్రకటించాయి. బీసీ సంక్షేమ సంఘం పేరుతో… ఉద్యమాలు నడిపే ఆర్.కృష్ణయ్యకు గత ఎన్నికల సమయంలో.. రాజకీయ యోగం పట్టింది. రాష్ట్ర విభజన… తెంలగాణ సెంటిమెంట్ వంటి అంశాలతో.. తెలంగాణలో పార్టీని నిలబెట్టుకోవడం కోసం.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆర్.కృష్ణయ్యను రంగంలోకి తీసుకొచ్చారు.
ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి.. తెలంగాణలో మెజార్టీలుగా ఉన్న బీసీల ఓట్లు పొందాలనే వ్యూహం పన్నారు. దాని కోసం.. ఆయనను ఎల్పీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా నిలబెట్టారు. ఆ స్థానం నుంచి టిక్కెట్ కోసం చివరి వరకూ పోరాడిన సామ రంగారెడ్డి అనే నేతను బుజ్జగించి ఆర్ కృష్ణయ్యను నిలబెట్టారు చంద్రబాబు. అక్కడ పార్టీ నేతలకే ఆయనను గెలిపించే బాధ్యతలు అప్పగించారు. వారు గెలిపించారు. తాను గెలిచినా.. టీడీపీ గెలవలేదని… తాను ముఖ్యమంత్రి కాలేకపోయానన్న ఆవేదన ఆయనలో ఉన్నట్లుగా ఉంది. ఆ తర్వాత కొన్నాళ్లు టీడీపీ కార్యక్రమాలకు వచ్చినా.. రాను రాను దూరమైపోయారు. బీసీ ఉద్యమాల పేరుతో ఆంధ్రాలోనూ హడావుడి చేశారు.
టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ.. కాపు రిజర్వేషన్లపై వ్యాఖ్యలు చేశారు. బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దాంతో.. తెలుగుదేశం తెలంగాణ నేతలు కూడా ఆయనను పట్టించుకోవడం మానేశారు. ఇక ఆయనకు ఎల్బీనగర్ టిక్కెట్ కూడా ఇచ్చే అవకాశం లేదని తేలిపోవడంతో.. ఆయన ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. టీడీపీ టిక్కెట్ ఇస్తే.. ఎన్నికల బరిలో నిలబడతానని ప్రకటించారు కానీ… టీడీపీ నేతలు దాన్ని పట్టించుకోలేదు. మరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండి.. ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో మరి..!