బీసీలకు రాజ్యాధికారం రావాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ లక్ష్యంతోనే త్వరలోనే పార్టీ పెట్టబోతున్నట్టు ఆయన ప్రకటించారు. అగ్రవర్ణాల నాయకులకు ఓట్లు వేసి, ఆ తరువాత హక్కుల కోసం వాళ్ల దగ్గర బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆరోపించారు. బీసీలకు న్యాయం జరగాలంటే ఒక పార్టీ అవసరమనీ, కొన్నాళ్లుగా బీసీలంతా ఒక వేదిక ఉండాలని తనపై ఒత్తిడి తెస్తున్నారనీ, అందుకే పార్టీ పెడుతున్నట్టు కృష్ణయ్య చెప్పారు.
ఏపీలో బీసీలకు సీఎం చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. బీసీ న్యాయమూర్తులను న్యాయవాదులుగా ఎదగనీయకుండా సీఎం అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి బీసీలు మద్దతు ఇచ్చారనీ, కానీ తమ కోసం ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. బీసీలకు ఉన్నత స్థానం దక్కకూడదన్న కుట్ర జరుగుతోందన్నారు. తమ గళం వినిపించడం కోసం, తమ హక్కుల కోసం పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. అంటే, ఆర్ కృష్ణయ్య కూడా ఏపీ రాజకీయాల మీదే దృష్టి సారించారన్నమాట. గత ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ మీద ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యేగా ఆయన ప్రజల తరఫున అసెంబ్లీలో మాట్లాడిందీ లేదు. ప్రజా ప్రతినిధిగా ఆ బాధ్యతల్ని పరిపూర్ణంగా నిర్వర్తించిందీ లేదు. ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగానే సొంత పార్టీ అంటున్నారు! ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. దాన్ని ఎవ్వరూ తప్పబట్టరు.
ఇక్కడో విషయం గుర్తు చేసుకోవాలి..! సరిగ్గా ఏడాది కిందట కూడా పార్టీ ఏర్పాటు గురించి కృష్ణయ్య మాట్లాడారు. పార్టీ నిర్మాణానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మాట్లాడాననీ, ఆయన సలహాలూ సూచనలూ ఇచ్చారని ఏడాది కిందట చెప్పారు. బీసీల సంక్షేమం కోసం పవన్ పనిచేస్తే, తమ మద్దతు ఉంటుందని కూడా అన్నారు. పవన్ కల్యాణ్ తో చర్చలూ సంప్రదింపులూ జరుగుతున్నాయనీ గతంలోనే కృష్ణయ్య చెప్పడం ఈ సందర్భంగా ప్రస్థావనార్హం. అంటే, అనూహ్యంగా టీడీపీ విషయంలో పవన్ యూ టర్న్ తీసుకోవడం, వివిధ మార్గాల్లో టీడీపీ లక్ష్యంగానే పోరాటం అంటూ ఉండటం చూస్తున్నాం. ఈ క్రమంలో ఆర్ కృష్ణయ్య ఆంధ్రాకి వచ్చి పార్టీ పెట్టి చంద్రబాబుపై పోరాటం అనడం కూడా ఈ వరుసలో చోటు చేసుకున్న పరిణామమా అనే అనుమానం కలుగుతోంది. ఏడాది కిందట కృష్ణయ్య చెప్పిన మాటల్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎవరికైనా ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది.