పవన్ కల్యాణ్ తన సొంత పార్టీ విషయంలోనే దానిని ఎప్పుడు ప్రారంభించడమో.. ఎలా ముందుకు తీసుకువెళ్లడమో తేల్చుకోలేకుండా సతమతం అవుతున్నారు. అలాంటిది ఆయన పాలిట మరో పార్టీ స్థాపనకు సంబంధించిన వ్యవహారం ఫిటింగు పెడుతున్నట్లున్నది. ఆయన ‘మద్దతు ఇస్తే పార్టీ పెడతాం, లేకుంటే లేదు’ అనే ఎజెండాతో బీసీల నాయకుడు కృష్ణయ్య కొత్త పార్టీ స్థాపించడం గురించి పవన్‌కల్యాణ్‌కు ముడిపెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలనుంచి బీసీల కోసం కొత్త పార్టీ స్థాపించాల్సిందిగా తన మీద బాగా వత్తిడి వస్తున్నదని తరచూ పాటపాడుతూ ఉండే ఆర్.కృష్ణయ్య.. ఇప్పుడు తన పార్టీ ఆలోచనకు పవన్‌కల్యాణ్‌తో లింకు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
ఆయన మాటల ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీలంతా తమకోసం కొత్త పార్టీ రావాలని కోరుకుంటున్నారట. అందుకు ఆర్.కృష్ణయ్య మీద ఒత్తిడి వస్తున్నదట. మరి బీసీ వర్గానికి చెందని పవన్‌కల్యాణ్ మద్దతు కావాలని ఆ బీసీలు ఎందుకు కోరుకుంటున్నారో.. ఇన్నాళ్లకు బీసీలకోసం బీసీల పార్టీ పెట్టుకుంటూ.. ఓసీ వర్గానికి చెందిన వ్యక్తిని నెత్తిన మోయడానికి ఎందుకు ఉత్సాహపడుతున్నారో ఆర్.కృష్ణయ్యకే తెలియాలి.
పవన్ కల్యాణ్ తన సొంత పార్టీ జనసేన విషయంలోనే ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారు. పైగా ఆయన తన రాజకీయం అనేది కుల మతాలకు అతీతంగా ఉంటుందని గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు కూడా! అలాంటిది ఇప్పుడు తనకంటూ ఒక పార్టీ ఉండగా, ఇప్పటికే భాజపా, తెదేపాలకు మద్దతు ఇస్తూ, మళ్లీ బీసీలు పెట్టే కొత్త పార్టీకి మద్దతు ఎలా ఇస్తాడని వీరు లెక్కలు వేస్తున్నారో అర్థం కావడం లేదు. అలాగనుక చేస్తే.. పవన్‌కల్యాణ్ ఎప్పటికీ పార్టీలకు మద్దతిచ్చే వ్యక్తిగానే తప్ప.. ప్రజలకోసం పనిచేసే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోజాలడని పలువురు అంటున్నారు.