తెలుగుదేశం పార్టీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య … రాజకీయ నేతగా కాకుండా.. బీసీ సంక్షేమ సమితి నేతగానే ఎక్కువ మందికి తెలుసు. గత ఎన్నికల ముందు ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశంలో పార్టీలో చేరిన ఆయనను… టీడీపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు ఓ ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఎక్స్ట్రా ఓట్లు వచ్చాయో కానీ… ఆర్.కృష్ణయ్యను ఎల్బీనగర్ను ఎమ్మెల్యేగా గెలిపించడానికి పడిన తంటాలు అన్నీ ఇన్నీ కావు. టిక్కెట్ ఆశించి.. కృష్ణయ్య రాకతో భంగపడిన సామ రంగారెడ్డి అనే లీడర్ … ఏమీ అనుకోకుండా.. కృష్ణయ్య కోసం అన్ని విధాలుగా కష్టపడ్డారు. గెలిచిన తర్వాత కృష్ణయ్య కొన్ని రోజులు టీడీపీతోనే ఉన్నా…. రేవంత్ ఎపిసోడ్ తర్వాత తన ఉద్యమాలు తాను చేసుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీ సమావేశాలకు రాకపోగా.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ జోక్యం చేసుకున్నారు. అక్కడ కాపు రిజర్వేషన్ల బిల్లు ఏపీ ప్రభుత్వం పెడితే..,. బీసీలకు నష్టం లేకుండా… కాపులకు అదనంగా రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినా… ప్రత్యేకంగా విజయవాడ వచ్చి మరీ విమర్శలు చేశారు. కొంత మంది సంఘాల నేతల పేరుతో హోటళ్లలో సమావేశాలు పెట్టి.. ఉద్యమిస్తారని హెచ్చరికలు జారీ చేసేవారు. అలాంటి సమయంలో.. టీడీపీ ఎమ్మెల్యేనే… కాపు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారంటూ.. సాక్షి లాంటి మీడియాలు పండుగ చేసుకునేవి. ఆయనకు చెప్పలేక.. చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితి లేక… టీడీపీ అలా వదిలేసింది. ఆ విమర్శలను భరించింది. ఈ మధ్యలో ఆయన పార్టీ పెడతానని కూడా హడావుడి చేశారు.
ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వచ్చే సరికి.,.. ఆయనకు ఎమ్మెల్యే పదవి గుర్తుకు వచ్చింది. పోయిన పదవి లేకపోతే.. ఇబ్బంది అవుతుందనుకున్నారేమో కానీ.. తాను ఇంకా టీడీపీకి రాజీనామా చేయలేదని ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నారు. ఈసారి జరగబోయే శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ ఎల్బీ నగర్ నుంచే పోటీ చేయాలన్న ఒత్తిడి ప్రజలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తల నుంచి వస్తోందన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఎలా చూసినా.. ఆయన టీడీపీ టిక్కెట్ చేస్తున్న ప్రయత్నాలేనని సులువుగా అర్థం అవుతుంది. మరి ఇంత కాలం… గెలిచిన పార్టీకి ఆయన చేసిన సేవ అంత నెగెటివ్‌గా ఉంటే ఏ పార్టీ అయినా తట్టుకుంటుందా..? పోటీ చేస్తానంటే టిక్కెట్ ఇస్తుందా..?