ఆర్.నారాయణ మూర్తి ఆర్థిక పరిస్థితి దారుణమైన స్థితిలో ఉందని, ఆయన ఇంటి అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఇటీవల వార్తలొచ్చాయి. ఇటీవల గద్దర్ చేసిన స్టేట్ మెంట్ల వల్ల.. ఇలాంటి వార్తలు బయటకు వచ్చాయి. నారాయణమూర్తి ఆర్థికంగా చిదికిపోయారని, ఆయన పరిస్థితి దయనీయంగా ఉందని రకరకాల కథనాలు మీడియాలో ట్రెండ్ అయ్యాయి… అవుతున్నాయి. వీటిపై నారాయణమూర్తి స్పందించారు. తన ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని, తాను చాలా సాధారణమైన జీవన శైలిని ఇష్టపడతానని, అందుకే తాను ఆర్థికంగా నలిగిపోయానన్న భావన వస్తోందని ఓ ప్రకటన లో పేర్కొన్నారు.
“నాకు కారు లేదు. ఎక్కడికైనా ఆటోలో వెళ్తా. నా ఆటో ఖర్చులకే నెలకు 30 వేలు అవుతుంది. అలాంటి నేను అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నానని పేర్కొవడం ఇబ్బందిగా అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నన్ను ఇష్టపడేవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లంతా ముందుకొచ్చి సాయం చేస్తానంటే బాధగా ఉంది. పల్లెటూరి వాతావరణం నాకు ఇష్టం. అందుకే సిటీకి దూరంగా ఉంటున్నాను. కోట్లు సంపాదించా. నాకు కావల్సినంత దాచుకుని, మిగిలినది ఛారిటీలకు ఇచ్చా“ అని పేర్కొన్నారు నారాయణమూర్తి.