సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్న ఆర్పీ పట్నాయక్… స్వరకర్తగా టాప్ పామ్‌లో ఉన్నప్పుడే ఓ పాడు బుద్ది పుట్టింది. యాక్టింగూ… డైరెక్షనూ చేసేయాలని. ఓ రంగంలో కీర్తి గడించిన వాళ్లకు మరో రంగంపైనా అజమాయిషీ చూపించాలని ఉండడం సర్వ సాధారణమే. అలా… మెగాఫోన్ పట్టేశాడు ఆర్పీ. అందమైన మనసులో పేరుతో ఓ అన్ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ తీసి… డైరెక్షన్ చేసే మెచ్యూరిటీ తనకింకా రాలేదని నిరూపించుకొన్నాడు. బ్రోకర్ మంచి ప్రయత్నమే. కాకపోతే… ప్రధాన పాత్రలో ఆర్పీ పట్నాయక్‌నే జనం చూళ్లేకపోయారు. ఎప్పుడో మూడేళ్ల క్రిందటే తులసీదళం మొదలెట్టినా.. దాన్ని పూర్తి చేయలేక నానా ఇబ్బందులు పడి, ఎట్టకేలకు ఎలాగో చుట్టేసి… ఈ శుక్రవారమే ప్రేక్షకుల మధ్యకు విసిరేశాడు. అయినా.. మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది.
దర్శకుడిగా ఆర్పీ ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందన్న నిజాన్ని.. తులసీదళం మళ్లీ నిరూపించింది. ఆ పేరుకీ, తాను తీసిన సినిమాకీ, చూపించిన సన్నివేశాలకూ, వెనుక వాయించిన ఆర్.ఆర్కీ అస్సలు పొంతనే లేదు. సినిమాలో అరవై సీన్లు ఉంటే.. అందులో 55 సీన్లు పరమ వేస్ట్. ఒక దశలో దర్శకుడు ఏం చెప్పాలనుకొన్నాడో కూడా సగటు ప్రేక్షకుడికి కూడా అర్థం కాదు. హారర్ సినిమా చూస్తే ఎవరికైనా భయం పుట్టాలి. కానీ.. తులసీ దళం చూస్తే.. అసహనంతో కూడిన ఓ నవ్వొస్తుంది. పతాక సన్నివేశాలు చూస్తే.. ఆర్పీపై జాలి కలుగుతుంది. ఆర్పీ నటనే అంత.. లేదంటే ఎక్స్ప్రెషన్స్ నిల్లా..?? అంటూ కొత్త అనుమానాలు కలుగుతాయి. మొత్తానికి తులసీదళం అన్నది మరో విఫలయత్నం గా మిలిగిలిపోయింది. కోటి రూపాయల వ్యయంతో ఈ సినిమాని చుట్టేశాడు కాబట్టి సరిపోయింది. లేదంటే… ఆర్పీ ఏమైపోదుడో?