‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత శంకర్ తో సినిమా అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. చరణ్ కి ఇది రైట్ మూవ్ అనుకొన్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచుకొన్నారు. ఆకాశాన్ని తాకిన అంచనాలు మెల్లమెల్లగా నేల మీదకు దిగి రావడం ప్రారంభించాయి. గేమ్ ఛేంజర్కు సంబంధించిన అప్ డేట్లు పెద్దగా బయటకు రాకపోవడం, ప్రమోషనల్ కంటెంట్ ఏదీ విడుదల చేయకపోవడంతో ఫ్యాన్స్ బాగా ఫీల్ అయ్యారు. అప్పుడెప్పుడో జమానా క్రితం ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఓ పాట విడుదల చేశారు. ఆ తరవాత కనీసం పోస్టర్ కూడా బయటకు రాలేదు.
బహుశా రిలీజ్ డేట్ విషయంలో నిర్మాత దిల్ రాజుకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఆయన కూడా ప్రమోషన్లపై దృష్టి పెట్టలేదనిపిస్తోంది. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చింది. ఈ క్రిస్మస్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ ‘గేమ్ ఛేంజర్’ విడుదల చేస్తామని దిల్ రాజు ప్రకటించారు. మరోవైపు మెల్లమెల్లగా ప్రమోషన్ కంటెంట్ ని విడుదల చేయడం మొదలెట్టారు. అందులో భాగంగా ఈ రోజు ‘రా మచ్చా’ పాటని విడుదల చేస్తున్నారు. ఈ పాట ఎలా ఉంటుందో చెప్పడానికి శంకర్ – తమన్, దిల్ రాజు – అనంత శ్రీరామ్ ల మధ్య జరిగిన చిట్ చాట్ వీడియోలను కూడా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. అక్టోబరులో టీజర్ వస్తుందని, నవంబరులో మరో పాట విడుదల చేస్తామని దిల్ రాజు చెప్పడం ఫ్యాన్స్ కు కాస్త రిలీఫ్ ఇచ్చినట్టైంది. బహుశా దసరా కానుకగా టీజర్ వచ్చే అవకాశం ఉంది. ఇకపై ‘గేమ్ ఛేంజర్’ నుంచి తరచూ ఏదో ఓ అప్ డేట్ ఇవ్వాలని చిత్రబృందం నిర్ణయించుకొంది. ఇన్నాళ్లకు మెగా ఫ్యాన్స్ బాధ దిల్ రాజు అండ్ కో కు అర్థమైంది. ఇకపై ‘గేమ్ ఛేంజర్’ ముచ్చట్లకు కొదవ ఉండకపోవొచ్చు.