ఈరోజు హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా ‘విశ్వంభర’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. `రామ రామ` అంటూ సాగే ఈ పాట… రాములోరి భక్తులకు బాగా నచ్చుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఇంతకంటే మంచి కానుక ఏముంది?
”రాములోరి గొప్ప చెప్పుకొందామా
సీతమ్మ లక్షణాలు మచ్చటించుకొందామా” అంటూ సీతారాముల గాథని, వాళ్ల విశిష్టతని ఈ పాటలో పరిచయం చేసే ప్రయత్నం చేశారు.
శంకర్ మహాదేవన్, లిప్సిక కలిసి ఆలపించిన పాట ఇది. రామజోగయ్యశాస్త్రి రాశారు. కీరవాణి సంగీతం అందించారు. పాట సింపుల్ గా వుంది. లిరిక్స్ లో అక్కడక్కడ… రామజోగయ్య చమత్కారం కనిపించింది. ఇది చిరంజీవి సినిమా పాట కదా అందుకే ఓ చోట…
”నీ గొంతు కలిపి మా వంత పాడగా రావయ్యా అంజని హనుమా
రామయ్య కీర్తన నోరార పలుకగా చిరంజీవి నీ జనమా” అంటూ రాశారు.
ఛోటా కె.నాయుడు కెమెరా పనితనం ఈ పాటలో కనిపించింది. పాట అంతా రంగుల హరివిల్లులా వుంది. చిరుని చూడ్డానికి అభిమానులకు రెండు కళ్లూ సరిపోవు. స్టెప్స్ సింపుల్ గా, పాటకు తగ్గట్టుగా ఉన్నాయి. ఈ సినిమాలో హనుమంతుల వారి పాట కూడా ఉందట. అదెప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. `విశ్వంభర` నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఇది. ఓరకంగా శుభారంభం అందినట్టే అనుకోవాలి. జులై 24న ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.