నిజమే… హీరోయిన్ రాశి ఖన్నా తల్లి కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఏదో కష్టం వచ్చిందని కాదు… కూతురికి మంచి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని! ఆదివారం రాత్రి జరిగిన ‘శ్రీనివాస కళ్యాణం’ ఆడియోలో రాశి స్వయంగా ఈ సంగతి చెప్పారు. అచ్చ తెలుగు సంస్కృతీ సాంప్రదాయాల నేపథ్యంలో పెళ్లిలోని విశిష్టతను, గొప్పదనాన్ని తెలియజేసే కథతో తెరకెక్కిన సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’. ఇందులో రాశి ఖన్నా మెయిన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. దర్శకుడు సతీష్ వేగేశ్న చెప్పిన వెంటనే ఓకే చెప్పేశానని ఆమె తెలిపారు. ఇంకా రాశి మాట్లాడుతూ “కథ నాకు ఎంత నచ్చిందంటే.. ఇంటికి వెళ్లి మా అమ్మకు కథ చెప్పా. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగడం నాకింకా గుర్తుంది. ‘శ్రీనివాస కళ్యాణం’ కథలో అంత పవర్ వుంది” అన్నారు.
‘శ్రీనివాస కళ్యాణం’ ఫస్ట్ లుక్, టీజర్లో రాశి ఖన్నా అప్పియరెన్స్కి ఫుల్ మార్క్స్ పడ్డాయి. అయితే.. దర్శకుడు సతీష్ వేగేశ్న ముందు హీరోయిన్గా రాశి ఖన్నాని అనుకోలేదట. నిర్మాత దిల్ రాజు ఆమె పేరు సూచిస్తే వద్దని చెప్పాడట. “సతీష్ వేగేశ్న స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాక, హీరోయిన్గా రాశి ఖన్నా పేరు చెబితే వద్దన్నాడు. నేను అప్పటికే ‘తొలిప్రేమ’ చూశా. తను చూడలేదు. సినిమా విడుదలయ్యాక తనని ఫైనల్ చేశాం” అని దిల్ రాజు చెప్పారు. అదీ సంగతి!!