Raayan movie review
తెలుగు360 రేటింగ్ 2.5/5
ధనుష్‌కి 50వ సినిమా. పైగా దర్శకుడు. ఇంతకంటే ఓ సినిమాపై ఆసక్తి పెరగడానికి కారణం ఏముండాలి?
తెరపై రెహమాన్ లాంటి పెద్ద పెద్ద పేర్లు మరింత ఎట్రాక్ట్ చేస్తాయి.
తెలుగు ఆడియన్స్‌కి అంటారా.. సందీప్ కిషన్ ఉండనే ఉన్నాడు. మనకిక్కడ ప్రమోషన్లు పెద్దగా లేకపోయినా, టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో కచ్చితంగా ‘రాయన్’ చూడాలన్న కుతూహలం కలుగుతుంది. మరీ ముఖ్యంగా ధనుష్ అంటే అభిమానించే వాళ్లకు.
మరి ‘రాయన్’ ఎలా ఉంది? ధనుష్ ఫ్యాన్స్‌ని మెప్పించిందా? దర్శకుడిగా ధనుష్‌కి ఎన్ని మార్కులు పడతాయి?
రాయన్ (ధనుష్)కి ఇద్దరు తమ్ముళ్లు. ఓ చెల్లాయి. చిన్నప్పుడే అమ్మా నాన్న దూరం అవుతారు. తన తమ్ముళ్లూ చెల్లాయితో మరో ఊరు వచ్చేస్తాడు. రెక్కల కష్టంతో వాళ్లని పెంచి పోషిస్తాడు. ఒక తమ్ముడు ముత్తు (సందీప్‌కిషన్)కు దూకుడెక్కువ. అక్కర్లేని గొడవల్లో తల దూరుస్తుంటాడు. అదే ఊరిలో దొరై, సేతు అనే రెండు వర్గాలు ఉంటాయి. ఒకరంటే ఒకరికి పడదు. వారిద్దరి మధ్య గొడవలో ముత్తు వెళ్తాడు. ఆ వ్యవహారం ముత్తు ప్రాణాలపైకి తీసుకొస్తుంది. రాయన్ ఎవరి జోలికీ వెళ్లడు. కానీ తన కుటుంబం జోలికొస్తే ఎవర్నీ వదలడు. రెండు బలమైన ముఠాల నుంచి తన తమ్ముళ్లని, చెల్లాయినీ ఎలా కాపాడుకొన్నాడు? ఈ ఘర్షణలో రాయన్ ఏం సాధించాడు? ఎవరిని కోల్పోయాడు? అనేది మిగిలిన కథ.
‘రాయన్’ ఇప్పటి వరకూ ఎవరూ రాయని కథైతే కాదు. ఇలాంటి కథలు చాలా వచ్చాయి. కాకపోతే ఆ ఎమోషన్కంటూ ఓ బలం ఉంది. అందుకే… ఎన్నిసార్లు ఈ కథని చెప్పినా, మళ్లీ చెప్పాలనిపిస్తుంటుంది. కథని చాలా సింపుల్ గా మొదలెట్టాడు ధనుష్. తన చెల్లాయి, తమ్ముళ్లంటే రాయన్ని ఎంత ఇష్టమో చెబుతూ ప్రేక్షకుల్ని కథలోకి తీసుకెళ్లాడు. రాయన్ బాల్యం, తను పడే కష్టాలు చాలా పాత సినిమాల్ని గుర్తు చేస్తుంది. ఛైల్డ్ ఎపిసోడ్ ముగిశాక.. కథ వేరే దారిలోకి వెళ్తుంది. రెండు వర్గాలు, వాళ్ల వైరం, మధ్యలో రాయన్ తమ్ముడు ముత్తు.. ఇలా కథని చాలా ఆసక్తిగా నడిపాడు. ఎక్కడా హీరోయిజం, బిల్డప్పులూ, ఓవర్ డ్రమటైజేషన్ ఉండవు. కథకు ఏం కావాలో, ఎంత కావాలో అంతే చెబుతూ చాలా షార్ప్‌గా కథనాన్ని ముందుకు తీసుకెళ్లాడు. రాయన్ హీరోయిజాన్ని బిల్డప్ చేసే సన్నివేశాలు కూడా సహజంగా కుదిరాయి. దొరై ఇంటికి వెళ్లి, తన కళ్ల ముందే రాయన్ విధ్వంసం సృష్టించిన యాక్షన్ సన్నివేశం బాగుంది. కాకపోతే.. దొరై ఎంత దుర్మార్గుడో ముందే ప్రభావవంతంగా చెబితే బాగుణ్ణు. అప్పుడు ఆ సీన్ మరింత బాగా పండేది. తొలి సగంలో సేతు (సూర్య) చేసింది చాలా తక్కువ. కానీ సేతుని సెకండాఫ్‌లో బాగా వాడుకొన్నాడు. దొరై అంతం అవ్వడం, రాయన్, అతని కుటుంబం ఈ ఛట్రంలో ఇరుక్కోవడంతో ఇంట్రవెల్ బ్యాంగ్ పడుతుంది. సాధారణంగా ఇంట్రవెల్ బ్యాంగ్ లో చాలా హంగామా సృష్టిస్తుంటారు. కానీ ‘రాయన్‌లో’ ఈ షాట్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఓ తమ్ముడు బియ్యం బస్తా, మరో తమ్ముడు వాటర్ క్యాన్ పట్టుకొని వస్తుంటే, వాళ్ల ముందు హీరో చేతి సంచితో నడుస్తుంటాడు. అక్కడ ఇంట్రవెల్ బ్యాంగ్ వేశారు. చూడ్డానికి సింపుల్ గా ఉన్నా, కథలో కాన్ఫ్లిక్ట్ చిక్కబడుతోందన్న ఫీలింగ్ అక్కడే ప్రేక్షకుడికి కలుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో దర్శకుడిగా తన మార్క్ చూపించగలిగాడు ధనుష్.
Read Also :ధనుష్ సినిమాని అలా వదిలేస్తారా ?
తొలి సగంలో లోపాలేం ఉండవు. సినిమాపై అప్పటికే ఓ ఇంప్రెషన్ పడిపోతుంది. దాన్ని కంటిన్యూ చేయడంలోనే రచయితగా, దర్శకుడిగా ధనుష్ పనితనంపై ఆధారపడి ఉంది. ఇక్కడ ధనుష్ కాస్త తడబడినట్టు అర్థమవుతుంది. సెకండాఫ్‌లో వచ్చే కాన్ఫ్లిక్ట్ అంత గొప్పగా ఉండదు. షాకింగ్ గానూ అనిపించదు. చాలా సాధారణంగానే ఉంటుంది. అప్పటి వరకూ రాయన్ – సేతు కథ కాస్త, రాయన్కీ తన తమ్ముళ్లకీ వైరంగా మారుతుంది. అలా మారడం వెనుక బలమైన కారణం చూపిస్తే బాగుండేది. కానీ.. ధనుష్ అలా చేయలేదు. అక్కడ రొటీన్ గానే ఆలోచించాడు. కానీ చెల్లాయి దుర్గ పాత్రని తీర్చిదిద్దిన విధానం నచ్చుతుంది. నిజంగానే దుర్గా దేవి అవతారంలో ఆ పాత్రని మలిచాడు ధనుష్. ఆమె పోరాటం, అన్న కోసం పడిన తాపత్రయం ఆకట్టుకొంటాయి. శేఖర్ (సెల్వ రాఘవన్) బాగానే డిజైన్ చేసినా, అది కూడా రొటీన్‌గా మొదలై, రొటీన్‌గానే ముగుస్తుంది. ప్రకాష్ రాజ్ చేసే హడావుడి, తన పోలీస్ వ్యూహం కథకు కొత్త కోణాన్ని తీసుకొచ్చేందుకు ఉపయోగపడింది. క్లైమాక్స్ ఊహకు అందుతూనే ఉంటుంది. ఆసుపత్రిలో యాక్షన్ సీన్, దుర్గ తీర్చుకొన్న ప్రతీకారం.. సెకండాఫ్‌లో నచ్చే అంశాలు.
ధనుష్ గెటప్ కొత్తగా ఉంది. ఈ సినిమాలో తనో సైలెంట్ వేవ్. ఎక్కువగా మాట్లాడడు. తన పని తాను చేసుకుంటూ పోతాడు. కళ్లల్లో ఓరకమైన తీక్షణత కనిపిస్తుంది. హీరోయిన్ లేకుండా, రొమాన్స్ ఎరక్కుండా, పూర్తిగా డీ గ్లామర్ పాత్రలో ఒకే టెంపోలో ఆ పాత్రని నడిపిన విధానం మెస్మరైజ్ చేస్తుంది. ఆ తరవాత ఎక్కువ మార్కులు సందీప్ కిషన్ కి పడతాయి. తొలి సగంలో తానే కాస్త ఎంటర్టైన్ చేశాడు. హీరో కంటే ఆ పాత్రే ఎక్కువ మాట్లాడుతుంది. సూర్య పాత్ర నెమ్మది నెమ్మదిగా తన విశ్వరూపం చూపించుకొంటూ వెళ్తుంది. ప్రకాష్ రాజ్‌ది కాస్త అటూ ఇటుగా గెస్ట్ రోల్. వరలక్ష్మీ శరత్ కుమార్దీ అంతే. కాకపోతే… తన సవతిని కిడ్నాప్ చేసినప్పుడు, ఆ ఆనందంలో నవ్విన నవ్వు… తప్పకుండా రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే.. అక్కడున్నది వరలక్ష్మీ శరత్ కుమార్ కాబట్టి.
దర్శకుడిగా, నటుడిగా ధనుష్ సక్సెస్ అయ్యాడు. సినిమా అంతా ఒకే మూడ్ లో నడిపించడం అంత తేలికైన విషయం కాదు. ఇక్కడే ధనుష్‌కు మంచి మార్కులు పడతాయి. టెక్నికల్ గా సినిమా మరింత బాగుంది. ముఖ్యంగా రెహమాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఈమధ్య రెహమాన్ బీజియమ్స్ ఇంతగా రిజిస్టర్ అవ్వలేదేమో..? తనకు కచ్చితంగా కమ్ బ్యాక్ అనిపించే సినిమా ఇది. ఫొటోగ్రఫీ, ఎడిటింగ్… ఇవన్నీ బాగా కుదిరాయి. కథని చాలా డౌన్ టూ ఎర్త్ మొదలెట్టిన ధనుష్ ఇంట్రవెల్ వరకూ అలానే తీసుకెళ్లాడు. కాన్ఫ్లిక్ట్ విషయంలో కాస్త తడబడినా, క్లైమాక్స్ లో మళ్లీ పుంజుకొన్నాడు. సెకండాఫ్‌పై కాస్త దృష్టి పెడితే, కచ్చితంగా మరింత మంచి రిజల్ట్ వచ్చేది. అయితే ఇప్పటికీ ఈ సినిమా ధనుష్ అభిమానుల్ని నిరాశ పరచదు. ఓసారి చూడదగిన కంటెంట్ అయితే సినిమాలో ఉంది.
తెలుగు360 రేటింగ్ 2.5/5