తెలంగాణ కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు సద్దుమణిగిందని ఈ మధ్య అంతా అనుకున్నారు. ఎందుకంటే, కొత్తగా రాష్ట్ర వ్యవహారాల బాధ్యతల్ని కుంతియా స్వీకరించడం, ఆ మధ్య ఆయన రాష్ట్రానికి వచ్చి, ఇక్కడి నేతలతో సమావేశం కావడం.. దీంతో కొంత మేర పరిస్థితి చక్కబడినట్టే అనిపించింది. అంతేకాదు, పీసీసీ అధ్యక్ష పీఠంలో కూడా ఎలాంటి మార్పులూ ఉండవనీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోనే టి. కాంగ్రెస్ ఎన్నికలను ఎదుర్కొంటుందని అధిష్ఠానం మాటగా కుంతియా చెప్పి వెళ్లిపోయారు. దీంతో పీసీసీ కోసం ఆశగా ప్రయత్నాలు చేస్తున్నవారి సంఖ్య తగ్గుతుందని అనుకుంటాం కదా! కానీ, అందుకు భిన్నంగా ఢిల్లీ స్థాయిలో మంతనాలు చేస్తున్నారట కొంతమంది కాంగ్రెస్ పెద్దలు. పీసీసీ పీఠం కోసం కోమటిరెడ్డి సోదరులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తమకు అవకాశం ఇస్తే రాష్ట్రమంతా పాదయాత్ర చేసి పార్టీని గెలిపిస్తామంటున్నారు. ఇక, డీకే అరుణ కూడా పీసీసీ రేస్ లోకి వచ్చేశారు. తనకు అవకాశం ఇస్తే పార్టీని ఎలా నడిపించగలనో అనే ఒక విజన్ తో ఢిల్లీ వెళ్లొచ్చారట! పార్టీలో సీనియర్ నేతనైన తనకు అవకాశం ఇవ్వాలంటూ జానారెడ్డి, బీసీ కార్డు పట్టుకుని ప్రయత్నిస్తున్న పొన్నాల లక్ష్మయ్య… ఇలా ఏ ఒక్కరూ తగ్గడం లేదని సమాచారం.
ఈ ప్రయత్నాల్లో కొత్త మార్పు ఏంటంటే… పీసీసీ పీఠం కావాలని ప్రయత్నిస్తున్నవారు, రాష్ట్రంలో తమకు మద్దతు ఇచ్చే నాయకులను దగ్గరకి చేర్చుకుంటున్నారు. జానారెడ్డికి షబ్బీర్ అలీ మద్దతు ఇస్తున్నారట. ఢిల్లీ స్థాయిలో షబ్బీర్ లాబీయింగ్ చేస్తున్నారట. జానాకి భట్టి విక్రమార్క మద్దతు కూడా ఉందని చెబుతున్నారు. ఇక, కోమటిరెడ్డి సోదరులైతే దిగ్విజయ్ మద్దతుతో ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. సర్వే సత్య నారాయణ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ల మద్దతు ఈ సోదరులకే ఉందట. ఇంతమంది ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఉత్తమ్ చాలా ధైర్యంగా ఉన్నారట. ఎందుకంటే, అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ తో ఉత్తమ్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. కాబట్టి, తన పదవికి ఎలాంటి ఢోకా లేదనేది ఆయన ధీమా. ఇక, డీకే అరుణ విషయానికొస్తే… కేసీఆర్ తట్టుకునే వాక్చాతుర్యం గల నాయకులు టి. కాంగ్రెస్ లో లేరనీ, అవకాశం ఇస్తే తనేంటో నిరూపించుకుంటాననే వాదనను ఆమె వినిపిస్తున్నారట.
ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉండటం విశేషం! విచిత్రం ఏంటంటే… వీరంతా ఒకే పార్టీ కోసం పనిచేస్తూ, ఒకరంటే ఒకరికి పడకుండా ప్రయత్నాలు చేస్తుండటం. పీసీసీ పదవి ఇస్తే తప్ప పాదయాత్ర చేయలేనని కోమటిరెడ్డి పట్టుబడతారు! తనకు అవకాశం ఇస్తే తప్ప కేసీఆర్ కు ధీటుగా సమాధానం చెప్పలేనని డీకే అరుణ అంటారు. పీసీసీ అధ్యక్ష పదవిలో కూర్చుంటే తప్ప పార్టీని గెలుపు బాటలో పెట్టే వ్యూహాలను చెప్పనని జానా అంటారు! అందరికీ పీసీసీ కావాలి. కానీ, అక్కడ ఉన్నది ఒకటే కుర్చీ! పదవి ఇస్తే తప్ప పార్టీ కోసం పనిచెయ్యరన్నమాట! మొత్తానికి, తెలంగాణ నేతలతో సోనియాకు కొత్త టెన్షన్ మొదలైందనే చెప్పొచ్చు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ తెరాస కొత్తకొత్త పథకాలు, సమీక్షల పేరుతో ఎన్నికలకు ఇప్పట్నుంచే సమాయత్తం అవుతోంది. కానీ, కాంగ్రెస్ లో ఇంటి పోరు ఈ స్థాయికి చేరింది. వీళ్లందరినీ ఎలా దారిలో పెడతారో వేచి చూడాలి.