టీఆర్ఎస్ అధినేత పెండింగ్‌లో పెట్టిన పధ్నాలుగు సీట్ల కోసం.. ఆశావాహులంతా.. ప్రగతి భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ ఎవరు దొరికితే వారిని పలకరించి.. తమ టిక్కెట్ విషయాన్ని గుర్తు చేసేందుకు పరుగులు పెడుతున్నారు. టిక్కెట్లు ప్రకటించని 14 నియోజకర్గాల్లో కొన్ని కీలకమైనవి ఉన్నాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రాతిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ అందులో ఒకటి. జగదీష్ రెడ్డి తన అనుచరులకు టిక్కెట్లు ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హుజుర్ నగర్ టిక్కెట్‌ను… కాసోజు శంకరమ్మ ఆశిస్తున్నారు. తనకు ఆర్థిక బలం లేదనుకుంటే.. ఎన్ ఆర్ ఐ అప్పిరెడ్డికి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతోంది. కానీ మంత్రి మాత్రం అడ్డు పడుతున్నారు.
ముషీరాబాద్ టిక్కెట్ కోసం రేసు చాలా తీవ్రంగా ఉంది. టిఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేత అయిన నాయిని నర్సింహరెడ్డి .. తన అల్లుడికి టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అక్కడి నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ముఠా గోపాల్ మళ్లీ తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఒకవైపు ఆయన అనుచరులు కూడ గోపాల్ కే టిక్కెట్ వస్తోందంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో నాయిని అల్లుడు.. రాంనగర్ కార్పోరేటర్ శ్రీనివాస్ రెడ్డి హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. తన అల్లుడికి కుదరకపోతే.. తనకే ఇవ్వాలని నాయిని డిమాండ్ చేస్తున్నారు. ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ రేసులో ముందున్నారు. కానీ అక్కడ బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఉండేలా.. బలహీన అభ్యర్థిని నిలబెడతారన్న ప్రచారం జరుగుతోంది.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎవర్ని అభ్యర్థిగా నిలబెట్టినా.. మరొకరు రెబల్‌గా నిలబడటం ఖాయంగా కనిపిస్తోంది. కోదాడలో పెద్దగా హోప్స్ లేకపోయినా..శశిధర్ రెడ్డిని ఖరారు చేస్తున్నారు. ఇక్కడ వేనేపల్లి వెంకటేశ్వరరావు టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని మిగతా నియోజకవర్గాలపై… పెద్దగా పంచాయతీ లేదు. ఎందుకంటే.. కొన్నిస్థానాల్లో బీజేపీకి లోపాయికారీగా మద్దతిస్తారన్న ప్రచారం జరుగుతోంది.