హుజూర్ నగర్ ఉప ఎన్నిక పూర్తయిన వెంటనే పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారని కథనాలు వచ్చాయి. ఇప్పుడు ఇదే అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది. త్వరలోనే తాను బాధ్యతల నుంచి తప్పుకుంటానంటూ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది! దీంతో త్వరలోనే టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం కూడా సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితిలో కొత్త అధ్యక్షుడి ఎంపిక అంత సులువుగా తీరే పంచాయితీలా కనిపించడం లేదు. ఎందుకంటే, ఆశావహుల జాబితా పెరిగి పేరుకుపోయింది!
లోక్ సభ ఎన్నికల తరువాత ఎంపీ రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే చర్చ జరిగింది. హైకమాండ్ కూడా ఆయన విషయంలో సుముఖంగా ఉందనే అభిప్రాయమూ కలిగింది. అయితే, హుజూర్ నగర్ ఉప ఎన్నిక రావడంతో రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించేవారు బయటపడిపోయారు. ఆయనకి నాయకత్వం ఇస్తే అదో పెద్ద సమస్య అవుతుందేమో అనే అనుమానం హైకమాండ్ కి కలిగేలా చేశారు. రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వం చర్చ రాగానే మొదటగా, బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేసింది సీనియర్ నేత వీ హన్మంతరావు. పార్టీలో సీనియర్ ని అనీ, బీసీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలన్నారు. అంతేకాదు, పార్టీలో కొత్తగా చేరినవారికి అవకాశం ఇవ్వొద్దనీ, వీర విధేయులు వేరనే వాదన తెరమీదికి తెచ్చారు. అలాంటివారితో ఓ ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేసి, తమకే ఇవ్వాలంటూ ఓ తీర్మానాన్ని కూడా ఢిల్లీకి పంపించారు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఎప్పట్నుంచో తాను పీసీసీ రేస్ లో ఉన్నానని చెప్పుకొస్తున్నారు. గులాంనబీ ఆజాద్ ద్వారా ఢిల్లీలో కొన్ని ప్రయత్నాలు కూడా చేశారని అంటారు! జగ్గారెడ్డి కూడా తనకి పీసీసీ ఇవ్వాలంటున్నారు. సంపత్, మధు యాష్కీ కూడా లైన్లో ఉన్నారు. జానారెడ్డి, శ్రీధర్ బాబు పేర్లు మొదట్నుంచీ రేసులో ఉన్నాయంటూ వినిపిస్తున్నవే.
ఆశావహుల జాబితా ఇంత పెద్దగా తయారైంది! వారి మధ్య సయోధ్య అత్యంత సంక్లిష్టంగా మారిపోయింది. దీంతో ఎవరి పేరును హైకమాండ్ ఖరారు చేసినా మిగతావారిలో అసంతృప్తి తప్పదు. అదే సమయంలో ఇతర పార్టీలకు వెళ్లిపోవాలనే నిర్ణయాలు తీసుకునేవారూ ఉంటారనడంలో సందేహం లేదు. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయకపోతే… మరింత ఇబ్బంది అయ్యే అవకాశమే పార్టీకి కనిపిస్తోంది. ఇంకా ఆలస్యం చేస్తూపోతే పార్టీపరంగా తెలంగాణలో కాంగ్రెస్ ని బలోపేతం చేయాల్సిన అసలు పని ఇంకా మొదలు కాలేదు. కాబట్టి, ఈ ఆశావహుల్నీ అసంతృప్త వాదుల్నీ వీలైనంత త్వరగా బుజ్జగించాల్సిన అవసరం హైకమాండ్ కి ఉందనే చెప్పాలి.