లక్షలు, కోట్ల మందికి నాయకుడిగా ఎదగాలనుకునేవాడికి సహనం చాలా ఎక్కువే ఉండాలి. అవతలి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని రకాలుగా హింసించినప్పటికీ…ఆ హింసను ఎదుర్కునే విధానం మాత్రం చాలా హుందాగా ఉండాలి. అప్పుడే ప్రజల్లో ఆ నాయకుడిపైన ఓ మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. కానీ వైకాపా అధినేత జగన్ మాత్రం ప్రతి విషయంలోనూ ఆవేశపడిపోతున్నాడు. చంద్రబాబు చేస్తున్న తప్పులు, అన్యాయాలకు ఆయనను చెప్పుతో సమాధానం చెప్పాలని ఒకసారి అంటాడు. చెప్పులు కాదు…చీపుర్లు అని మరోసారి చెప్తాడు. ఇప్పుడు వైకాపా నాయకులందరూ కూడా జగన్నే ఫాలో అవుతున్నట్టుగా ఉన్నారు. నిన్న పొద్దుటూరు పురపాలక ఛైర్మన్ ఎన్నిక రెండోసారి వాయిదా పడగానే వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన చెప్పుతో తానే కొట్టుకుని తీవ్రస్థాయిలో నిరసన తెలిపాడు. అసలు విషయం పక్కకు పోయి ఆయన చేసిన పని గురించి చర్చించుకునే పరిస్థితులు వచ్చాయి.
ఇప్పుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే కాదు గతంలో జగన్, రోజా..ఇంకా చాలా మంది నాయకులు ఇలానే తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. ప్రత్యేక హోదా పోరాటం కోసం విశాఖ వెళ్ళిన జగన్‌ని ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నప్పుడు జగన్ స్పందన కూడా విమర్శలకు దారితీసింది. అలాగే వైకాపా ఎమ్మెల్యే రోజా మాటలు, చర్యలు అయితే అసెంబ్లీ లోపలా, బయటా కూడా అనేక విమర్శలకు తావిస్తున్నాయి. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండడంపైన స్పందించాలనుకోవడం బాగానే ఉంది కానీ మీడియాను అట్రాక్ట్ చేయడం కోసం తీవ్రస్థాయిలో స్పందిస్తూ ఉండడం మాత్రం జగన్‌పైన ఉన్న ఫ్యాక్షన్ ముద్రను బలపరిచేలా ఉంది. 2004 ఎన్నికల్లో వైఎస్‌ను గెలిపించిన అనేక అంశాల్లో వైఎస్ సహనం కూడా ఒకటి. పాదయాత్రతో కోపం నరం తెగిపోయింది అని చెప్పుకున్న వైఎస్…ఆ తర్వాత చనిపోయే వరకూ కూడా అదే స్వభావాన్ని కంటిన్యూ చేసి అందరి మెప్పూ పొందాడు. ప్రతి విషయంలోనూ వైఎస్సే ఆదర్శం అని చెప్పుకునో జగన్ అండ్ కో ఇప్పుడు సహనం విషయంలో కూడా వైఎస్‌ని అనుసరిస్తే ఆ పార్టీకే మంచిది. నోటితో తిట్టుకోవడాలు, చెప్పులతో కొట్టుకోవడాలు, చీపుర్లు చూపించడాలు కాకుండా కాస్త హుందాగా నిరసన తెలియచేయడం నేర్చుకుంటే రాయలసీమతో పాటు…అన్ని ప్రాంతాల ప్రజల మెప్పూ పొందే అవకాశం ఉంటుంది.