తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ… టిజెఎసి కొలువుల కొట్లాట సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అభ్యంతరాల మధ్య న్యాయస్థానంలో వాదనల తర్వాత… ఎట్టకేలకు నిర్వహించిన సభలో కోదండరామ్ సహా గద్దర్, చుక్కా రామయ్య తదితరులు మాట్లాడారు. అంతటి మహామహులు, మేధావులు మాట్లాడినప్పటికీ వీరందరికన్నా మిన్నగా సభికుల హర్షధ్వానాలు అందుకున్నారు రచన.
వృత్తిరీత్యా న్యాయవాది అయిన రచనారెడ్డి…గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వంతో వివిధ అంశాలపై పోరాడుతూ వచ్చారు. భూ నిర్వాసితుల తరపున ఆమె పోరాటం వార్తల్లోకి ఎక్కింది. అలాగే ఆమె కూడా వార్తల్లో వ్య్యక్తి అయ్యారు. ఈ నేపధ్యంలోనే కొట్లాటకు హాజరైన రచనారెడ్డి… తన ప్రసంగంలో ప్రభుత్వానికి చురకలతో పాటే నిరుద్యోగులకు చక్కని సూచనలు, సందేశాలు ఇవ్వడం ద్వారా అందర్నీ ఆకట్టుకున్నారు.
ఉద్యోగాల కోసం యువత చావాల్సిన అవసరం లేదంటూ ఆమె హితవు చెప్పారు. పోరాడి సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి గాని ఆత్మహత్యలు చేసుకోవడం మంచిది కాదన్నారు… ప్రభుత్వాధినేతలై విద్యార్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి ఎక్కిళ్లు వచ్చేలా కొట్లాడాలంటూ ఉత్తేజం అందించారు.. మీరు తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలను అనుభవించే హక్కు మీకు మాత్రమే ఉందంటూ గుర్తు చేశారు.
చట్టవ్యతిరేకంగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నప్రభుత్వం అదేమని ప్రశ్నిస్తే నోటిఫికేషన్లకు అడ్డుపడుతున్నారని తమపై నింద వేస్తోందంటూ ఆరోపించారు.
“ప్రభుత్వానికే చిత్తశుద్ది ఉంటే లొసుగుల్లేకుండా ఉద్యోగ ప్రకటన చేపట్టి ఉండేది. అలా చేస్తే కోర్టే వాటిని స్వీకరించదు కదా..? మేం కాదు, ఎవరు అడ్డుపడ్డా నియామకాలు ఆగవు కదా… అలాంటి నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయరు?” అంటూ ప్రభుత్వ ద్వంద్వవైఖరిని సునిశితంగా తూర్పారబట్టటారు.” గట్టిగా ప్రయత్నించి కొలువులను సాధించుకోవాలి… కొలువులు ఇస్తరా లేక చస్తరా అని ప్రభుత్వాధినేతల్ని ప్రశ్నించే సమయం ఆసన్నమైంది…’’ అంటూ సాగిన రచనారెడ్డి ప్రసంగానికి విద్యార్థుల నుంచి అశేష స్పందన లభించింది… విద్యార్థుల నినాదాలు, ఈలలతో సభాస్థలి మారుమోగింది. వచ్చే ఎన్నికల్లో రచనారెడ్డి తనదైన ముద్ర వేయనున్నారని తొలిసారిగా రాజకీయవిశ్లేషకులు భావించేందుకు ఈ సభ ఊతమిచ్చింది.