ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్టర్ వేమూరి రాధాకృష్ణ.. గత మూడు నెలలుగా… తన వారాంతపు… రాజకీయ వ్యాసం “కొత్తపలుకు”లో తెలంగాణ రాజకీయాలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అసెంబ్లీని రద్దు చేసిన తర్వాతి ఆదివారం ఆయన రాసిన వ్యాసంలో ” కారు జోరు ఆపతరమా..” అని హెడ్డింగ్ పెట్టి… ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. టీఆర్ఎస్కు 80 సీట్లు ఖాయమని లెక్క చెప్పారు. ఆ తర్వాత నుంచి.. ఆయన తన టోన్ మార్చుకుంటూ వచ్చారు. చివరికి గత వారానికి వచ్చే సరికి.. టీఆర్ఎస్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకుందని నిర్దారించేశారు. మరి పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన తన వ్యాసంలో ఏమన్నారు..?
టీఆర్ఎస్ కచ్చితంగా ఓడిపోతుందని…”కొత్తపలుకు”లో వేమూరి రాధాకృష్ణ ఎక్కడా రాయలేదు. కానీ.. గెలిస్తే… ప్రత్యర్థుల అంతు చూస్తామన్న… కేటీఆర్ మాటలపై మాత్రం క్లాస్ తీసుకున్నారు. అది విజ్ఞులైన రాజకీయ నాయకుల లక్షణం కాదన్నారు. విపక్ష పార్టీలన్నీ ఏకం కావడానికి కేసీఆర్ అహంకారమే కారణంగా తేల్చారు. గద్దర్ – చంద్రబాబు, చంద్రబాబు – కోదండరాం కాంబినేషన్లు.. ఎలా సాధ్యమయ్యాయో విశ్లేషించారు. వాటికి కేసీఆర్ బాధ్యత తప్ప మరొకరు కాదని చెప్పుకొచ్చారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే.. ఆయన హిట్ లిస్ట్‌లో తాము ఉండటం ఖాయంగా కాబట్టి… ఆయనను ఓడించడానికి మరో మార్గం లేక.. అందరూ జత కట్టారని.. అందులో వారికి మరో ప్రత్యామ్నాయం లేదని చెబుతున్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వేపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను కూడా.. వేమూరి రాధాకృష్ణ తప్పు పట్టారు. ఆయన మూడు నెలల కిందట 90 సీట్లు గెలుస్తారని.. నివేదిక ఇస్తే… సంతోషించారని.. ఇప్పుడు ఆయనే వ్యతిరేకంగా చెబితే… విమర్శిస్తున్నారని.. ఇదేం పద్దతని రాధాకృష్ణ సూటిగానే ప్రశ్నించారు. “ఆంధ్రా” పేరుతో పాత వాదనలను తీసుకొచ్చి సాధించేదేమిటంటున్నారు. అంతే కాదు.. రేపు … లగడపాటి సర్వే నిజమని తేలితే.. కేటీఆర్ ఏం సమాధానం చెప్పుకుంటారని ప్రశ్నించారు.
మొత్తంగా కొత్తపలుకులో రాధాకృష్ణ మాత్రం… టీఆర్ఎస్ విషయంలో.. కాస్తంత పాజిటివ్ గానే వ్యవహరించారు. పోలింగ్ సరళి గురించి ఎక్కడా విశ్లేషించలేదు. కానీ.. పోలింగ్ శాతం పెరగడం వల్ల.. హంగ్ రాదని సంతృప్తి వ్యక్తం చేశారు. ఏదో ఓ పార్టీకి పూర్తి మెజార్టీ రావాలని.. హంగ్ వస్తే.. అన్ని దుష్ఫరిణామాలే ఉంటాయని అంచనా వేశారు. అంతిమంగా.. ఆయన గెలిచినా.. అణుకువగా ఉండాలన్న విషయాన్ని… కేసీఆర్, కేటీఆర్‌కు తన ఆర్టికల్ ద్వారా సందేశంలా పంపారని అనుకోవచ్చు.