హైదరాబాద్: వరంగల్ ఉపఎన్నికపై – ‘అక్కడేదో తేడాగా ఉంది’ అంటూ ఆంధ్రజ్యోతి కథనం ఇవ్వటంపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. వరంగల్లో టీఆర్ఎస్కు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణకు మతి పోయిందని విద్యుత్ శాఖమంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. మానసిక ఆరోగ్యంలో తేడా వచ్చినందువల్లే తేడాగా ఉంది అంటూ కథనాలు ఇస్తున్నాడని ఆరోపించారు.
వరంగల్ టీఆర్ఎస్లో నిరసన సెగలున్నాయని, వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆంధ్రజ్యోతి కథనంలో పేర్కొన్నారు. మంత్రులు ప్రచారానికి ఎటు వెళ్ళినా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని, ఓటర్లు నిలదీస్తున్నారని రాశారు. దీనిపై జగదీశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. అది కట్టు కథ అని, వరంగల్ ఉపఎన్నికలో టీఆర్ఎస్కు లభిస్తున్న ఆదరణ చూసి రాధాకృష్ణకు మతి పోయిందని అన్నారు. మంత్రులను ఓటర్లు నిలదీయటం సహజమేనని, తమ దగ్గరకు వచ్చిన మంత్రులను ప్రజలు సమస్యల గురించి అడుగుతూ ఉంటారని జగదీశ్వర్ చెప్పారు. రాధాకృష్ణకు తెలంగాణ ప్రజలంటే ద్వేషమని ఆరోపించారు. పక్కరాష్ట్రంలోని వారికి ఇష్టమైన నాయకుడు, ముఖ్యమంత్రి విఫలమవుతున్నాడన్న బాధతో రాధాకృష్ణ ఈ కథనాలు రాయిస్తున్నాడని అన్నారు. వరంగల్ ఉపఎన్నిక ఏకపక్షంగా తమవైపే ఉందని చెప్పారు. రాధాకృష్ణ తెలంగాణ ద్రోహి అని, దొంగ అని జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు.