ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `రాధే శ్యామ్`. ఈ సినిమా అప్ డేట్ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఆశగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం మోషన్ పోస్టర్ విడుదల చేసింది. పేరుకి మోషన్ పోస్టర్ అయినా, చిన్న సైజు టీజర్ లా ఉందది. ఈ సినిమా కథ, కాన్లిఫ్ట్ కూడా చూచాయిగా చెప్పే ప్రయత్నం చేసింది.
`జాతకం` నేపథ్యంలో సాగే కథ ఇదని… ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. దాన్ని నిజం చేస్తూ.. మోషన్ పోస్టర్లో అరచేయి, అందులోని గీతలతో మొదలెట్టారు. ఇదో ప్రేమ కథ. దాన్ని సూచిస్తూ.. రోమియో జూలియట్, సలీమ్ అనార్కలీ, దేవదాసు పార్వతీ జంటల్ని కళ్ల ముందుకు తీసుకొచ్చి – చివరి రాధే శ్యామ్‌లను చూపించారు. ఈ కథలో రైలు పెట్టెకీ చాలా ప్రత్యేకత ఉంది. మోషన్ పోస్టర్ కూడా రైల్లోనే సాగుతుంది. ఓ అజరామరమైన ప్రేమకథని `రాధే శ్యామ్` లో చూడబోతున్నామన్న విషయాన్ని మోషన్ పోస్టర్‌తో చెప్పకనే చెప్పేశారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.యూవీ సంస్థ నిర్మిస్తోంది 2021లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.