దేవతామూర్తిగా, దుర్గామాతగా చెప్పుకుంటున్న రాథేమా చుట్టూ ఉచ్చుబిగుసుకుంటోంది. మూఢనమ్మకాలు, వరకట్నం, అశ్లీలత – అసభ్యకర చేష్టలకు సంబంధించిన కేసులు ఆమెను మరింత వివాదాస్పద వ్యక్తిగా మార్చేస్తున్నాయి. వీటికితోడు సోషల్ మీడియా, టివీఛానెళ్లు ఆమె ప్రతికదలికను పసిగట్టి బట్టబయలుచేయడంతో ఆమె ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇవన్నీ ఇలాఉంటే, ఆమె అధికారిక వెబ్ సైట్ హ్యాక్ కి గురికావడం మరో షాక్.
ఈ తాజా పరిస్థితులను గమనించిన మద్దతుదార్లు నెమ్మదిగా మొహం చాటేస్తున్నారు. నిన్న మొన్నటి దాగా ఆమెను ఆరాధించినవాళ్లూ, ఆమె చుట్టూ తిరిగిన భక్తగణం కూడా ఒక్కొక్కరూ జారుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆమెకు మద్దతు పలికితే, తాము కూడా కేసుల్లో చిక్కుకోవాల్సివస్తుందన్న భయం భక్తగణంలో చోటుచేసుకుంటున్నట్టుంది. పైగా మహారాష్ట్రలో మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం (2013) బలోపేతంగా ఉండటం
ఆమెను మరింత ఇరకాటంలో పడేసే సూచనలే కనబడుతున్నాయి.
మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం
ఇప్పుడు తాజాగా మరో పోలీస్ కేసు నమోదైంది. వరకట్నం, అశ్లీలత వంటి కేసులను ఎదుర్కుంటున్న రాథేమాకు మరో కేసు బిగుసుకుంది. ముంబయ్ లోని బోరివలి పోలీస్ స్టేషన్లో న్యాయవాది అశోక్ రాజ్ పుట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేస్తూ, రాథేమాగా పిలవబడుతన్న సుకవిందర్ కౌర్ పై మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం క్రింద కేసునమోదుచేసి చర్యలు తీసుకోవాలని కోరారు. మూఢనమ్మకాలను వ్యాప్తిచేయడమేకాకుండా, అశ్లీలంగా రాథేమా ప్రవర్తిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. మహారాష్ట్రలో అమలులోఉన్న మూఢనమ్మకాల వ్యతిరేకచట్టం – 2013 క్రింద కేసునమోదుచేయడానికి సరపడా సాక్ష్యాధారాలున్నాయాలేవా అన్నది పోలీసులు పరిశీలిస్తున్నారు. నరబలులువంటి అమానుష చర్యలకు పాల్పడినా, లేదా క్షుద్రశక్తులను ఆవాహనచేయడం వంటి తంతులకు పాల్పడినా, లేదా, అఘోరీ పూజలు, ఆచారాలకు పాల్పడినా, లేదా బ్లాక్ మ్యాజిక్ పేరిట పూజాదికాలు చేసినా ఈ చట్టం క్రింద చర్యలు తీసుకోవచ్చు. అంతేకాదు, నాన్ బెయిల్ బుల్ గా ఈ చట్టంక్రింద కేసులునమోదుచేసే వీలుంది. చట్టం అమలులోకి వచ్చినఏడాది (2013)లో నాలుగు కేసులు నమోదుకాగా, క్రిందటి ఏడాది ఈ సంఖ్య 14కి పెరిగింది.
కాగా, గతవారమే ఒక మహిళ వరకట్నవేధింపుల క్రింద రాథేమాపై కేసు పెట్టింది. వరకట్నం విషయంలో తన అత్తమామలను రాథేమా ప్రభావితం చేసిందని ఈ వివాహిత తన పిటీషన్ లో పేర్కొన్నారు. తన అత్తమామలు చాలాఏళ్లుగా రాథేమా భక్తులనీ, దీంతో ఆమె చెప్పినట్టు నడుచుకోవడం అలవాటైందనీ, వరకట్నం తీసుకోవచ్చంటూ అత్తమామలను రాథేమా ప్రభావితం చేశారని వివాహిత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు దాఖలుచేసిన ఎఫ్.ఐ.ఆర్ లో రాథేమా పేరుకూడా చేర్చారు.
హ్యాకైన రాథేమా వెబ్ సెట్
ఈ కేసుల వ్యవహారం ఇలా నడుస్తుండగా, మరోపక్క రాథేమా అధికారిక వెబ్ సైట్ www.radhemaa.com ని ఈమధ్య హ్యాక్ చేశారు. అయితే ప్రస్తుతం దీన్ని పునరద్ధరించినా మళ్ళీ హ్యాక్ కి గురికాదన్న గ్యారంటీలేదు. రాథేమా వెబ్ సైట్ ని శనివారంనాడు హ్యాక్ చేసిన వ్యక్తి ఆ వెబ్ సైట్ లో రాథేమా రెడ్ కలర్ మినీ స్కర్ట్ తో దిగిన ఫోటోలను ఉంచాడు. అంతేకాదు, తన భక్తులను ఆప్యాయంగా కౌగలించికున్న చిత్రాలను, ముద్దుపెట్టుకుంటున్న ఫోటోలను కూడా ఉంచాడు. రాథేమా అధికారిక వెబ్ సైట్ హ్యాక్ అయినట్టు ముందుగా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురానికి చెందిన రాహుల్ అనే వ్యక్తి గుర్తించాడు. హ్యాక్ చేసిన వ్యక్తి మేసేజ్ ను కుడా అతను భద్రపరిచాడు. `రాథేమా అమాయకులను ఫూల్ చేసేపని మానుకోవాలం’టూ ఈ హ్యాకర్ తన మెసేజ్ లో పేర్కొన్నాడు. మహిళలను బుట్టలోవేసుకునే పెద్ద కుంభకోణాన్ని రాథేమా నడుపుతున్నారంటూ కూడా ఈ హ్యాకర్ ఆరోపించాడు.
అయితే తన చుట్టూ ఇంతటి వివాదం రాజుకుంటున్నా, రాథేమా మాత్రం కూల్ గానే కనబడుతున్నారు. తానుమాత్రం ఎవ్వరిమీదా ఫిర్యాదు చేయడంలేదని 50ఏల్ల రాథేమా చెప్పారు. ఇలా నామీద విరుచుకుపడేవారంతా రావణులు (అసురులు) వాళ్లుతీసుకున్న గోతిలో వాళ్లేపడతారు’ అంటూ ఒక టీవీఛానెల్ ద్వారా తన స్పందన తెలియజేశారు.
మొత్తానికి రాథేమా వ్యవహారం ఇప్పుడు వీధినపడింది. ఇటు పోలీస్ కేసులూ, అటు మీడియా ఆమెను ఊపిరాడనివ్వడంలేదు.
– కణ్వస