జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో చేసిన విధ్వంసానికి తోడు.. ఎన్నో తెల్ల ఏనుగుల్లాంటి వ్యవస్థల్ని తెచ్చిపెట్టిపోయారు. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థను ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ పనితీరును చూస్తే… అసలు చేయడానికి వారికి పనులేమీ ఉండవని క్లారిటీ వస్తోంది. ఒక్కో సచివాలయంలో పది మందిని వివిధ విభాగాల్లో నియమించారు. వారికి ఎలాంటి పని ఉండటం లేదు. కేవలం సంక్షేమ పథకాల డబ్బులు డోర్ డెలివరీ చేయడమే వారి పని.
అందుకే ఇప్పుడు ఆ ఉద్యోగులందర్నీ ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలన్న పరిశీలనను ఏపీ ప్రభుత్వం చేస్తోంది. మహిళా పోలీసులు ఖాళీగా ఉన్నారు. వారికి యూనిఫాం ఉద్యోగం ఇవ్వడానికి లేదు.దానికి పోలీస్ రిక్రూట్మెంట్ రూల్స్ ఒప్పుకోవు. కనీసం మహిళా పోలీసులు అని పిలవడానికి కూడా అవకాశం లేదు. మిగిలిన వారిలో కూడా పని చేసే వారు దాదాపుగా ఎవరూ ఉండరు. సాధారణంగా మీ సేవలో అయ్యే పనులన్నీ వాటిని క్లోజ్ చేసి.. సచివాలయాలకు కేటాయించారు. రాజకీయ స్వార్థం కోసం తెచ్చిన వ్యవస్థలు కావడంతో ఇప్పుడు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.
సచివాలయ వ్యవస్థను ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిశీలన చేసి త్వరలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా వారిని ప్రతి అడ్డగోలు పనికి ఉపయోగించుకునేలా కాకుండా… ప్రభుత్వ ఉద్యోగులుగా పూర్తి స్థాయి గౌరవం ఇచ్చేలా చూసేందుకు ప్రయత్నించనుంది.