భారత వాయుసేనలోకి రాఫెల్ యుద్ధ విమానాలు చేరాయి. మొత్తం ఐదు రాఫెల్ జెట్ ఫైటర్లు… ఫ్రాన్స్ నుంచి అంబాలాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్నాయి. మధ్యలో.. గాల్లోనే ఓ సారి ఇంధనం నింపుకున్నాయి. మరోసారి యూఏఈ ఎయిర్‌బేస్ దగ్గర ఓ సారి ఆగాయి. వీటిని భారత వాయుసేనకు చెందిన పైలెట్లే తీసుకు వచ్చారు. ఇవి మొత్తం 7364 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇండియా చేరాయి.
ఫ్రాన్స్‌లోని డస్సాల్ట్ ఏవియేషన్ కంపెనీ నుంచి భారత్… మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాల్ని కొనే డీల్ కుదుర్చుకుంది. వాటిలో ఒక దాన్ని ఇప్పటికే అప్పగించారు. ఇప్పుడు మరో ఐదు వచ్చాయి. వీటిని నడిపేందుకు పైలట్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన 12 మంది పైలట్లు రాఫెల్ నడిపేందుకు ఫ్రాన్స్‌లో శిక్షణ పొందారు. మొత్తం 36 మంది పైలట్లకు ట్రైనింగ్ ఇచ్చేలా ఒప్పందం ఉంది. కరోనా కారణంగా ఫ్రాన్స్‌లోనూ లాక్డౌన్ విధించడంతో.. యుద్ధ విమానాల రాక ఆలస్యం అవుతుందని అనుకున్నారు. అయితే చైనాతో ఉద్రిక్తతల్ని దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ ప్రకారమే డెలివరీ చెయ్యాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్…కోరారు. ఆ ప్రకారమే… వాటిని ఇచ్చేందుకు దసాల్ట్ కంపెనీ ముందుకు వచ్చింది.
శత్రుదేశాలు ప్రయోగించే ఆయుధాలను ఎదుర్కొనేందుకు పైలెట్స్ లైటనింగ్తో కూడిన వేగవంతమైన సామర్థ్యం , లెహ్ లాంటి ఎక్కువ ఎత్తు నుంచి దాడులను వేగంగా చేసేవి, శత్రువుల ట్రాకింగ్ సిస్టమ్స్ ను గుర్తించేందుకు అవసరమయ్యే రాడార్ వార్మింగ్, దేశంలోపలికి చేసే క్షిపణి దాడులను ఎదుర్కొనే డికాయ్ సిస్టమ్ వంటివి రాఫేల్ యుద్ధవిమానంలో ఉన్నాయి. గరిష్టంగా మూడు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను రాఫెల్ చేధిస్తుంది. రాఫెల్ అణ్వాయుధాలను సులువుగా ప్రయోగిస్తుంది. రఫేల్ పూర్తిస్థాయి ఆయుధ వ్యవస్థ అక్టోబర్‌లో భారత్‌కు చేరనుంది.