నాని సినిమా ‘హిట్ 3’ మే 1న థియేటర్లలో సందడి చేయబోతోంది. మే 2 నుంచి తన కొత్త సినిమా ‘పారడైజ్’ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఓ వారం ఆలస్యంగా నాని సెట్లో అడుగుపెడతారు. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా రాఘవ్ జుయల్ ని ఎంచుకొన్నట్టు టాక్. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘కిల్లో’ రాఘవ్ విలన్గా నటించాడు. అంతకు ముందు కొన్ని సినిమాల్లో హీరోగానూ మెరిశాడు. కిల్ లో అయితే రాఘవ్ విశ్వరూపం కనిపించింది. ‘పారడైజ్’ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా. అందుకే… రాఘవ్ని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది.
ఎస్.ఎల్.వీ సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. మార్చి 26న విడుదల చేస్తారు. అదే రోజున.. రామ్ చరణ్ ‘పెద్ది’ కూడా విడుదలకు రెడీ అవుతోంది. ‘పారడైజ్’ ఎలా ఉండబోతోందో చెప్పడానికి ఈమధ్య ఓ గ్లింప్స్ విడుదల చేశారు. ఆ గ్లింప్స్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. నానిని ఈ తరహా పాత్రలో చూడడం ఇదే తొలిసారి. గ్లింప్స్ లోని డైలాగ్స్, నాని గెటప్ రోమాంఛితంగా ఉన్నాయి. ‘హిట్ 3’లో నాని నరుకుడు చూసి ‘నానిపై ఇంత యాక్షన్ వర్కవుట్ అవుతుందా’ అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇంతకు మించిన యాక్షన్ ‘పారడైజ్’లో కనిపించబోతోందట. ‘హిట్ 3’ అనేది ప్రస్తుతానికి శాంపిల్ మాత్రమే అనుకోవాలి.