తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్ నిర్వాకాలు ఒక్కొక్కటిగా ప్రభుత్వం వెలికి తీస్తోంది. దీంతో ఆ సంస్థ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు… మొత్తం సాగించుకున్న పెత్తందారుల్లో రాఘవ కన్స్ట్రక్షన్స్ కూడా ఒకటి. దాదాపుగా ప్రతి నెలా జగన్ తో సమావేశానికి పొంగులేటి వచ్చేవారు. డీల్స్ మాట్లాడుకుని వెళ్లేవారు. కాంట్రాక్టులు దక్కే నాలుగైదు సంస్థల్లో ఖచ్చితంగా రాఘవ సంస్థ కూడా ఉంటుంది. దాని అనుబంధ కంపెనీలకు మరికొన్ని కాంట్రాక్టులు లభిస్తాయి.
అలా వచ్చిన కాంట్రాక్టులను సరిగ్గా పూర్తి చేశారా అంటే… అసలు పనులే ప్రారంభించలేదు. విశాఖలో భూగర్భ విద్యుత్ లైన్ల పనులు చేస్తామని చెప్పి కాంట్రాక్ట్ తీసుకుని సైలెంట్ అయిపోయారు. కడపలో అన్న మయ్య డ్యాం నిర్మించే కాంట్రాక్ట్ కూడా రాఘువదే. అడ్వానులు తీసుకున్నారు కానీ పనులు ప్రారంభించారు. ఇంకా కొన్ని కాంట్రాక్టులు రాఘవ సంస్థ చేతిలో ఉన్నాయి. గనుల సీవరేజీ వసూలు చేసే కాంట్రాక్టును కూడా మూడుజిల్లాల్లో తీసుకుని డబ్బులు వసూలు చేసి ప్రభుత్వానికి కట్టడం మానేశారు. లెక్క తేలే అవకాశం కనిపించడంతో నెల రోజుల కిందట హడావుడిగా అరవై కోట్లు కట్టేశారు.
అయితే ఇంకా చాలా లెక్కలు తేలాల్సి ఉంది. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే పొంగులేటి.. వైసీపీకి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేశారు. మూడు, నాలుగు జిల్లాల్లో వైసీపీ ఖర్చును గత ఎన్నికల్లో ఆయన పెట్టుకున్నారని చెబుతారు. అందుకే టీడీపీ ఆయనను ఏ మాత్రం సహించకూడదని నిర్ణయించుకుంది. ఆయన కంపెనీల లెక్కలు.. అందులోని బొక్కలన్నీ పట్టుకుని వరుసగా నోటీసులు జారీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.