హిందూ రాజ్య స్థాపనకు సహకారం ఇవ్వలేదని చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడిపై కొంత మంది దాడి చేసిన వ్యవహారం కలకలం రేపుతోంది. అసలు టార్గెటెడ్ గా వెళ్లి చిలుకూరు ఆలయ పూజారిపై దాడి చేయడం వెనుక కుట్ర ఉందని భావిస్తున్నారు. ఈ కేసులో కొత్తూరు వీర రాఘవరెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆయన రామరాజ్యం అనే సంస్థ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా పోస్టులు ఉన్నాయి. రూ. 350 రిజిస్ట్రేషన్ ఫీజు కడితే.. ఇరవై వేలు జీతం ఇచ్చి సైన్యంలో చేర్చుకుంటామని ఇచ్చిన ప్రకటనలు ఇచ్చినవి వైరల్ అవుతున్నాయి.
ఈ వీరరాఘవ రెడ్డి రామరాజ్యం పేరుతో కొన్ని రెచ్చగొట్టే వీడియోలు కూడా చేశాడు. ఇతని వ్యవహారం తేడాగా ఉందని ఏదో ఎజెండాతో ఈ దాడులకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిందూ ధర్మం పేరుతో పూజారిపై దాడి చేసేవారు ఎవరూ ఉండరని కుట్ర ఏమిటో బయట పెట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ వీరరాఘవరెడ్డి గోదావరి జిల్లాలు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు.
సమాజంలో అశాంతి రేపడానికి… ఇలాంటి కొన్ని ముఠాలు తయారయ్యే అవకాశాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ అంశంపై పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టి దర్యాప్తు చేయాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. జరిగింది పూజారిపై దాడికాబట్టి రాజకీయం కూడా ఇందులో ప్రారంభమవడం ఖాయం. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉంది.