ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు చాలా బలంగా ఉండేవి. విస్తృతమైన ఓటు బ్యాంక్ ఉండేది. ఇప్పుడు ఏమయింది ?. పొత్తులో ఒక్క సీటు తీసుకుంటే సీపీఐకి మహా ప్రసాదం అయింది. సీపీఎం కు ఆ ఒక్క సీటు కూడా దండగేనని కాంగ్రెస్ తేల్చేసుకుంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది?.ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఎవరో తెలుసా ?. వారి పార్టీ కార్యకర్తలకు మాత్రమే తెలుసు. సామాన్య జనానికి తెలియదు. మీడియా ప్రతినిధుల్లో చాలా మందికి తెలియదు.
తాజాగా సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ అనే నేతను ఎన్నుకున్నట్లుగా ప్రకటించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ నుంచి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, నర్సింగ్ రావు వంటి వారిని తీసేశారు. ఎందుకంటే వారికి డెబ్భై ఏళ్లు దాటిపోయాయి. జాన్ వెస్లీ స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా. ఆయన ఎంత మందికి తెలుసు.. ఓ పార్టీ రాష్ట్ర నాయకుడు అంటే కనీస గుర్తింపు ఉండాలి కదా. అలాంటి గుర్తింపు జాన్ వెస్లీకి లేదు. అలాగే సీపీఐ పార్టీ పరిస్థితి కూడా. ఏపీలో కూడా ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు ఎవరో ఎవరికీ తెలియదు.
కమ్యూనిస్టు పార్టీలంటే తామేనని సీపీఎం తరపున రాఘవులు, సీపీఐ తరపున నారాయణ రాజకీయాలు చేశారు. తమ తర్వాతి నాయకత్వాన్ని తీర్చిదిద్దడంలో వారు ఘోరంగా విఫలమయ్యారు. ప్రతి దానికి రాఘువులు, నారాయణ తామే అంటూ ముందుకు వచ్చేవారు. దశాబ్దాలుగా పార్టీని వారి గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇతరుల్ని లీడర్లుగా ప్రోజెక్ట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయకత్వాలు అనామకుల చేతుల్లోకి వెళ్లిపోయాయన్న అభిప్రాయంది. ఇది ఆ పార్టీ చేసుకున్న స్వయంకృతమే. నేతల వ్యక్తిగత స్వార్థం కోసం కమ్యూనిస్టు పార్టీలు బలైపోయాయి.