హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్లో ప్రసారమయ్యే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ కార్యక్రమంలో పాల్గొనేవారి సమాధానాలతో పాటు ఇంటర్వ్యూ చేసే వేమూరి రాధాకృష్ణ ప్రశ్నలు కూడా ఆసక్తికరంగా, విలక్షణంగా ఉంటాయి. దాదాపుగా తెలుగువారిలో రాజకీయ, సినీ ప్రముఖులందరినీ రాధాకృష్ణ ఈ కార్యక్రమంలో ఇంటర్వ్యూలు చేసేశారు… పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ప్రభాస్ వంటి కొద్దిమందిని తప్పిస్తే. అయితే వచ్చే వారం ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమం మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించిన ప్రోమోను కూడా ఏబీఎన్ ఛానల్ రిలీజ్ చేసేసింది.
రాఘవేంద్రరావు కొద్దికాలం క్రితం వరకు అసలు మీడియాతోగానీ, సభలలోగానీ మాట్లాడేవారే కాదు. అయితే ఇటీవల తానే స్వయంగా సౌందర్యలహరి పేరుతో ఈటీవీలో ఒక షో చేసి, తనతో సినిమాలు చేసిన సినీ ప్రముఖులలో ఒక్కొక్కరిని వారం వారం ఆహ్వానించి టాక్ షోలాగా నడిపారు. చిత్రాల రూపకల్పనలో తన అనుభవాలను, అనుభూతులను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇక ఆ షో దగ్గరనుంచి సభలలో మాట్లాడటం, మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వటం ప్రారంభించారు. ఇటీవల ‘టీవీ 9’ ఎన్కౌంటర్ కార్యక్రమంలో కూడా పాల్గొని అనేక వివాదాస్పద అంశాలపై స్పందించారు. ఏది ఏమైనా అవన్నీ ఒక ఎత్తయితే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ఒక ఎత్తు. వేమూరి రాధాకృష్ణ తన ఇంటర్వ్యూలలో ఎదురుగా కూర్చున్నవారికి సంబంధించిన వివాదాలనుగానీ, వ్యవహారాలను గానీ వేటినీ వదలరు. మరి ఈ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావుకు సంబంధించిన వివాదాలను, వ్యవహారాలను అన్నింటినీ ప్రస్తావిస్తారా, లేదే అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాఘవేంద్రరావుకు సంబంధించి, ముఖ్యంగా రికార్డింగ్ ధియేటర్ స్థలంలో మల్టీప్లెక్స్ వివాదం, నటుడు రాజశేఖర్ దాడి చేసి కొట్టిన వివాదం, నిర్మాత మురారి చెప్పుదెబ్బను తప్పించుకున్న వివాదం వంటివాటిని రాధాకృష్ణ ప్రస్తావిస్తారా, లేదా అనేది వేచి చూడాలి.