దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఇప్పుడు కొత్తగా పంతులుగారి అవతారంలోకి మారబోతున్నారు. పేముబెత్తము చేతబూనకపోవచ్చు గానీ.. ఆసక్తి ఉన్న వారికి పాఠాలు బోధించడానికి సిద్ధమౌతున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండానే… చాలా మందికి ఎంతో క్రేజీగా ఉండే సినీ దర్శకత్వానికి సంబంధించి పాఠాలు నేర్పడానికి ఆయన స్వచ్ఛందంగా సిద్ధపడడం విశేషం. ప్రస్తుతం యువతరాన్ని ఔత్సాహికుల్ని అందుకోవడానికి ఎంతో సులువైన మాధ్యమంగా ఉన్న ఇంటర్నెట్ను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ దర్శకేంద్రుడు దర్శకత్వ పాఠాలను తెలియజెప్పడానికి రెడీ అవుతున్నారు.
కెఆర్ఆర్ ఫిలి స్కూల్ పేరుతో ఈ దర్శకత్వ పాఠాలు వీడియోలుగా ఒక సిరీస్‌గా విడుదల అవుతాయి. అయితే యూనివర్సిటీలో, ఫిలిం స్కూళ్లలో మాదిరిగా పాఠాలు చెప్పడమూ, సిలబస్ పరీక్షలు లాంటివి ఇందులో ఉండవు. అన్ని రకాల జోనర్లను ప్రతిబింబిస్తూ వంద చిత్రాలు తీసిన దిగ్దర్శకుడిగా తన చిత్రాలు, అప్పటి దృశ్యాలను చిత్రీకరించడంలో తన జీవితానుభవాలనే పాఠాలుగా ఆయన చెప్పబోతున్నారు.
ఈ విషయాన్ని దర్శకేంద్రుడు ఒక టీజర్ వీడియోద్వారా స్వయంగా వెల్లడించారు. నిజానికి విశ్వవిద్యాలయాలు చెప్పే పాఠాలకంటె ఇలాంటి అనుభవ పాఠాల ద్వారానే ఎక్కువగా విద్య నేర్వడం వీలవుతుందని నమ్మే వారు కూడా ఉన్నారు. దర్శకుడిగా రాఘవేంద్రరావు అనుభవసారాన్ని తక్కువ చేయగలవారెవ్వరూ ఉండరు. అన్ని రకాల చిత్రాలూ తీసిన పాటవం ఆయన సొంతం. దర్శకత్వ శాఖ మీద ఆయనకున్న పట్టు అసామాన్యం. అందుకే తెలుగు దర్శకులలో రసపిపాసకు, సౌందర్యాత్మకతకు, భారీ సూపర్హిట్లకు పేరుమోసిన దర్శకేంద్రుని ఫిలిం డైరక్షన్ పాఠాలనుంచి ఔత్సాహికులు ఎక్కువ మందికి ఉపయోగం కలిగే అవకాశం ఉంది. విద్య ఎంత బాగా అబ్బింది అనే విషయం చెప్పే వాళ్లను బట్టి ఉంటుందనుకోవడం భ్రమ… నేర్చుకునే వారిని బట్టి ఉంటుంది. దర్శకేంద్రుడి అనుభవాలనుంచి కూడా ఎవరు ఎంతగా నేర్చుకోగలరు అనేది వారి స్థాయిని, ఆసక్తిని, శ్రద్ధను బట్టి ఉంది. ఎవరు ఎంత పిండుకోగలిగితే.. అంతగా ఫలితం ఇచ్చే ఊటచెలమలా ఆయన పాఠాలు ఉంటాయనడంలో సందేహం లేదు.