చిరంజీవి – రాఘవేంద్రరావుల అనుబంధం ప్రత్యేకమైనది. ఇద్దరి కాంబినేషన్లో 14 సినిమాలొచ్చాయి. అన్నీ దాదాపుగా హిట్లే. రాఘవేంద్రరావు చిరుని `బాబాయ్` అని పిలవడం – వాళ్ల అనుబంధానికి నిదర్శనం. చిరు ఇంట్లో ఏ వేడుక జరిగినా, రాఘవేంద్రరావు ఉంటారు. రాఘవేంద్ర రావు ఏం చేసినా, అందులో చిరు పాత్ర కనిపిస్తూనే ఉంటుంది.
చిరుకి పెళ్లయిన కొత్తలో… రాఘవేంద్రరావు ఓ సడన్ సర్ప్రైజ్ చేశార్ట. ఈ విషయాన్ని చిరంజీవినే స్వయంగా తెలిపారు. `పెళ్లి సందడి` ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లారు. అక్కడ ఫ్లాష్ బ్యాక్‌లో రాఘవేంద్రరావు ఇచ్చిన స్వీట్ షాక్ ని గుర్తు చేశారు. ”పెళ్లైన కొత్తలో మేటు పాళెం నుంచి చెన్నై వచ్చే ట్రైన్లో నేనూ, సురేఖ ఎక్కాం. ఆ ట్రైన్లో మా కోసం ఓ కుపేని రాఘవేంద్రరావు గారు బుక్ చేశారు. వెళ్లి చూడగానే.. అదో అందమైన శోభనం గదిలా తయారు చేసి పెట్టారు. అక్కడ పళ్లూ, పూలూ ఉంచారు. ఆ ఏర్పాట్లు చూసి షాకయ్యాం. ఇలాంటి స్వీట్ మెమొరీస్ ఎన్నో ఇచ్చారు రాఘవేంద్రరావు” అంటూ పాత రోజుల్ని ఓసారి గుర్తు చేస్తున్నారు. ”కెరీర్ మొదలైన కొత్తలో `మోసగాడు`సినిమాలో చిన్న పాత్ర చేశాను. ఆయన దర్శకత్వంలో పూర్తి స్థాయి హీరోగా ఓసినిమా చేయాలని ఉండేది. అడవి దొంగతో అది తీరింది. అప్పటికి రామారావుగారు రాజకీయాల్లోకి వెళ్లారు. ఆయన వెళ్లాక.. తెలుగు సినిమాకి ఆ స్థాయిలో కలక్షన్లు వస్తాయా? అనుకునేవాళ్లం. అడవిదొంగ భారీ విజయాన్ని సొంతం చేసుకుని, వసూళ్ల వర్షం కురిపించింది. పరిశ్రమలో నేనూ నిలబడ్డాను అనే భరోసా ఇచ్చింది. ఇదంతా రాఘవేంద్రరావు వల్లే సాధ్యమైంది” అని తమ అనుబంధం గురించి చెప్పుకొచ్చారు చిరు.