ఓం నమో వేంకటేశాయతో రిటైర్ అయిపోదామనుకొన్నాడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. అయితే ఆ సినిమా ఫ్లాప్అవ్వడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సివచ్చింది. ఓ ఫ్లాప్ సినిమాతో కెరీర్‌కి పుల్ స్టాప్ పెట్టడం రాఘవేంద్రరావుకి ఇష్టం లేదు. పైగా.. తాను కమర్షియల్ సినిమాల్లో రారాజు. తెలుగు సినిమాకి కమర్షియాలిటీ నేర్పింది ఆయన. అందుకే… ఈసారి ఓ భారీ కమర్షియల్ సినిమా తీసి, ఓ హిట్టుతో… తన కెరీర్‌కి శుభం కార్డు వేయాలని భావిస్తున్నాడట. అందుకోసం ఓ స్క్రిప్టు కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓ సోషల్ మెసేజ్‌తో… ఓ కథ తయారు చేశారని, దానికిప్పుడు తుది మెరుగులు దిద్దుతున్నారని సమాచారం.
రాఘవేంద్రరావు అడిగితే… ఏ అగ్ర కథానాయకుడూ.. నో చెప్పడు. కాకపోతే.. ప్రస్తుతం బడా హీరోలంతా బిజీ. తన స్క్రిప్టుకి ఎవరు నప్పుతారో.. వాళ్ల కోసం ఎదురుచూడాలా?? లేదంటే దొరికినవాళ్లకు తగినట్టు మరో కథ సిద్ధం చేసుకోవాలా అనే ఆలోచనలో రాఘవేంద్రరావు ఉన్నాడట. ఈలోగా తనయుడు ప్రకాష్ కోవెల మూడి తీయబోతున్న సినిమా విషయంలో తన సహాయ సహకారాలు అందించాలని, తనయుడి సినిమా పూర్తయ్యాక.. తన సినిమాని పట్టాలెక్కించాలనిచూస్తున్నాడు. ఓ హిట్టు కొట్టి రిటైర్మెంట్ తీసుకోవాలన్న నిర్ణయం బాగానే ఉంది. కాకపోతే.. హీరోలే అందుబాటులో లేరు. చూద్దాం… రాఘవేంద్రుడికి ఈసారి ఆపన్న హస్తం అందించే హీరో ఎవరో..!