టాలీవుడ్ పెద్ద ఎవరు?
– ఇప్పుడు ఇదే బిలియన్ డాలర్ల ప్రశ్న. ఆ స్థానం చిరంజీవిదే అని ఓ వర్గం అంటుంటే, మరో వర్గం మాత్రం `దాసరి లేని లోటు భర్తీ చేయలేరు` అంటోంది. ఇంకో వర్గం.. `మంచు ఫ్యామిలీనే` పెద్ద దిక్కు అని కొత్త పాట పాడుతోంది. దీనిపై ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తనదైన శైలిలో స్పందించారు. `అసలు చిత్రసీమకు పెద్ద దిక్కే అవసరం లేద`ని తేల్చేశారు.
”ఇక్కడ ఎవరి మాట ఎవరూ వినరు. అలాంటప్పుడు సలహాలు ఇవ్వడం ఎందుకు? చెప్పిన పని చేయకపోతే బాధ పడడం ఎందుకు? ఆ అవసరం లేదు” అని చెప్పుకొచ్చారు రాఘవేంద్రరావు. ఇండ్రస్ట్రీలో ఉన్న పెద్దలందరితోనూ దర్శకేంద్రుడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయనకు చిరంజీవి కావాలి.. మోహన్ బాబూ కావాలి. అందుకే మధ్యేమార్గంగా ఈ తరహా కామెంట్లు చేశారేమో..?
”నా జీవితంలో రెండే రెండు కోరికలున్నాయి. ఒకటి అజాత శత్రువు అనిపించుకోవాలి. రెండోది.. ఎవరికీ సలహాలు ఇవ్వకూడదు. ఇండ్రస్ట్రీ నాకు చాలా గౌరవించింది. ఈతరం దర్శకులు సైతం అభిమానిస్తున్నారు. ఇప్పుడు వాళ్ల మధ్య పెద్దరికం చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది” అంటూ… సున్నితంగా చెప్పి తప్పించుకున్నారు రాఘవేంద్రరావు.