మొక్కులు రకరకాలుగా వుంటాయి. తలనీలాలు గడ్డాలు మీసాలు పెంచి తిరుపతిలో సమర్పించడం తరతరాలుగా కొనసాగుతున్న ఒక విశ్వాసం.ఎవరిపైనైనా పందెం కడితే గడ్డం మీసం పెంచి విజయం సాధించాకే తీసేస్తామని చెబుతుంటారు. ఇందుకు భిన్నంగా ముందే జుట్టు ఇవ్వడం మరో రకం.దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఇదే తరహాలో ప్రత్యేక హౌదా కోసం గడ్డం త్యాగం చేశారు.ఆయన పేరు చెప్పగానే గుబురుగడ్డం గుర్తొస్తుంది. సోమవారం నాడు ఆయన తిరుపతిలో గడ్డం లేకుండా కనిపించారు. ఏమంటే ప్రత్యేక హౌదా కోసం శ్రీవారికి గడ్డం మొక్కు చెల్లించానన్నారు. అన్నట్టు ఆయన గతంలో టిటిడి బోర్డు సభ్యుడుగా కూడా పనిచేశారు. త్వరలో ఎస్విబిసి ఛానల్ సిఇవోగా వెళ్లవచ్చనే వార్తలు కూడా వున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతి వెళ్లి గడ్డం ఇచ్చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్కు ప్రత్యేక హౌదా ఇచ్చేలా మనసు మార్చాలని కోరుతూ గడ్డం ఇచ్చానన్నారు.బాగానే వుంది గాని మోడీ మొండి గడ్డం వున్నంత వరకూ మరెవరు ఏం చేస్తేం ఏమయ్యేట్టని సందేహం! ఆ మాటకొస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుకూ ఓ గడ్డం వుంది కదా! ఎటొచ్చీ దర్శకేంద్రుడు రాఘవేంద్రుడే గడ్డం త్యాగం చేసేశారు మరి.తెలంగాణలో కాంగ్రెస్ అద్యక్షుడు మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ను ఓడిస్తానంటూ గడ్డం పెంచి తిరుగుతున్నారు. సో పెంచినా తీయించినా మొక్కు మొక్కే!