గురువుని మించిన శిష్యుడు అనిపించుకొనే అదృష్టం… చాలా అరుదుగా వస్తుంది. ఆ అర్హత అక్షరాలా ఉన్నవాడు రాజమౌళి. రాఘవేంద్రరావు శిష్యుడిగా రంగ ప్రవేశం చేసినా… చాలా తక్కువ టైమ్‌లోనే తనకంటూ ఓ ముద్ర వేసుకొన్నాడు. `ఇది రాజమౌళి సినిమా` అనిపించుకొన్నాడు. `మా గురువు గారు రాఘవేంద్రరావు` అని రాజమౌళి ఎంత గర్వంగా చెప్పుకొంటాడో తెలీదు గానీ.. `నా శిష్యుడు రాజమౌళి` అని రాఘవేంద్రరావు సగర్వంగా చెప్పుకొంటుంటాడు. ఇప్పుడు కూడా అంతే. తన శిష్యుడిపై ప్రేమని చాలా ఘనంగా చాటుకొన్నాడు రాఘవేంద్రుడు.
బాహుబలి 3 తీస్తే.. అందులో ఒక్క షాట్ కి అయినా నాకు దర్శకత్వం వహించే అవకాశం ఇవ్వు.. అని శిష్యుడ్ని కోరాడు రాఘవేంద్రరావు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు సమర్పకుడన్న సంగతి తెలిసిందే. అయినా సరే.. ఏ రోజూ సెట్ కి వెళ్లి ఏం జరుగుంది? అనేది చూళ్లేదట. ఈసారి మాత్రం సెట్ కి వెళ్తానంటున్నారాయన. వెళ్లడమే కాదు… రాజమౌళి అవకాశం ఇస్తే.. ఓ షాట్‌కి కూడా దర్శకత్వం వహిస్తానంటున్నారు. అదీ… రాఘవేంద్రుడికి శిష్యుడిపై ఉన్న ప్రేమ. బాహుబలి 3 అనే ఆలోచన రాజమౌళికి ప్రస్తుతానికైతే లేదు. మరి.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఈరోజే చెప్పలేం. ఒకవేళ బాహుబలి 3 తీస్తే.. గురువుకి ఈ శిష్యుడు అవకాశం ఇస్తాడో లేదో..??