హైదరాబాద్: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చిత్రాల టైటిల్ కార్డ్స్‌లో చివరికి వచ్చే టైటిల్ కార్డులో రాఘవేంద్రరావు బి.ఎ. అని ఉండటం ఒక ప్రత్యేకత అన్న విషయం తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఆ బి.ఎ. వెనక మతలబును రాఘవేంద్రరావు వివరించారు. నిన్న ఏబీఎన్ ఛానల్లో ప్రసారమైన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో మాట్లాడుతూ, తన తొలి చిత్రంలో పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఈశ్వర్ తన టైటిల్ కార్డ్‌లో రాఘవేంద్రరావు బి.ఎ. అని రాశారని తెలిపారు. ఒక చిత్రంలో బి.ఎ. అని లేకుండా పడటంతో సెంటిమెంట్‌గా పట్టుకుందని చెప్పారు. దీంతో ప్రతి చిత్రానికీ బి.ఎ. అని వేయటం మర్చిపోవద్దని చెప్పేవాడనని, ఇప్పుడు తలుచుకుంటే తనకే సిగ్గుగా ఉంటుంది అన్నారు. బి.ఎ. అంటే వేరే అర్థం ఉందని కొందరంటారు కదా అని వేమూరి రాధాకృష్ణ అడగగా, బొడ్డు మీద యాపిల్ అని రాఘవేంద్రరావే చెప్పారు. కేవలం పాటల్ని చూసి అలా మాట్లాడితే తనకు మనసు చివుక్కుమంటుందని అన్నారు. జ్యోతి, దేవత, కల్పన, ఆమె కథ, బొబ్బిలి బ్రహ్మన్న, జస్టిస్ చౌదరి… లాంటి కథాబలం ఉన్న చిత్రాలనూ తీశానని రాఘవేంద్రరావు చెప్పారు.