దర్శకేంద్రుడికి మళ్లీ సినిమాలపై ధ్యాస మళ్లింది. ముగ్గురు దర్శకులు, ముగ్గురు హీరోయిన్లు, ఓ హీరోతో సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు. రాఘవేంద్రరావు నిర్మాతగా ఉంటూనే దర్శకత్వ పర్యవేక్షణ చేయబోతున్నాడు. ఇది మూడు కథలు. మూడు కథలకూ లింకు వేసుకుని క్లైమాక్స్ సిద్ధం చేశారు. ఒక్కో కథకు ఒక్కో దర్శకుడు పని చేస్తాడన్నమాట. క్రిష్, బివిఎస్ రవి, గౌతమ్ తిన్ననూరి, అనిల్ రావిపూడి.. ఇలా యువ దర్శకుల లిస్టు దర్శకేంద్రుడి దగ్గర ఉంది. వీళ్లతో రాఘవేంద్రరావు సంప్రదింపులు కూడా జరిపారు. క్రిష్, బివిఎస్ రవి దాదాపు ఖాయమయ్యారు. అనిల్ మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉండడం వల్ల… ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటాడా? లేదా? అనేది అనుమానంగా మారింది.
మరోవైపు దర్శకేంద్రుడు కథానాయికల కోసం వేట మొదలెట్టాడు. ఆయన మనసులో పెద్ద పెద్ద హీరోయిన్లే ఉన్నారు. కాకపోతే ఇది ప్రయోగాత్మక చిత్రం. ఒకొక్కరి పాత్ర నాలుగైదు సన్నివేశాలకు పరిమితం అవుతుంది. ఇలాంటి సినిమాల్లో నటించడానికి స్టార్ హీరోయిన్లు ముందుకు వస్తారా? అనేదే డౌటు. లేదంటే ముగ్గురుని కొత్తవాళ్లనే తీసుకోవాల్సివస్తుంది. ఇప్పటికిప్పుడు ముగ్గురు కొత్తవాళ్లని ఎంపిక చేయడం అంత సులభం కాదు. జులై నుంచి షూటింగ్ ప్రారంభించాలని రాఘవేంద్రరావు భావిస్తున్నాడట. మరి.. అంతలోగా ఎవరు దొరుకుతారో చూడాలి.