ప్రభాస్ – నాగ అశ్విన్ ల సినిమాని వైజయంతీ మూవీస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రాజెక్టులోకి అమితాబ్ బచ్చన్ ఎంట్రీ ఇవ్వడంతో – అశ్వనీదత్ మరింత ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్టు పర్యవేక్షకుడిగా వెటరన్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుని ఎంచుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమా ఫాంటసీ నేపథ్యంలో సాగుతోంది. ఇందులో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ లాంటి వ్యవహారాలూ ఉన్నాయని తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ లాంటి సినిమాలు తీయడంలో.. సింగీతం అందివేసిన చేయి, అందుకే ఆయన సలహాలూ, సూచనలు ఉపయోగపడతాయన్న అభిప్రాయంతో సింగీతంని టీమ్ లోకి తీసుకొంది చిత్రబృందం.
ఇప్పుడు రాఘవేంద్రరావు కూడా ఓ చేయి వేస్తున్నట్టు సమాచారం. స్క్రిప్టు పర్యవేక్షకుడిగానో,దర్శకత్వ పర్యవేక్షకుడిగానో ఆయన పేరు ఉండకపోవొచ్చు. కానీ పరోక్షంగా తన వంతు సలహాలూ సూచనలూ అందిస్తున్నారని తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ కి, రాఘవేంద్రరావుకీ మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ స్నేహంతో, అభిమానంతో.. దర్శకేంద్రుడి దగ్గర కొన్ని విలువైన సలహాలు తీసుకున్నార్ట. ఫాంటసీ సినిమాలు తీయడంలో దర్శకేంద్రుడు దిట్ట. అందుకే ఓ కీలకమైన ఎపిసోడ్ విషయంలో రాఘవేంద్రరావు సలహా నాగ అశ్విన్ తీసుకున్నాడని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమాకి అనుభవజ్ఞుల అండ దండలున్నాయన్నమాట. పెద్దల మాట చద్ది మూట అని వదలకుండా – వాళ్లని ఈ ప్రాజెక్టులోకి ఇన్వాల్ చేసుకుంటున్నాడు నాగ అశ్విన్. వాళ్ల అనుభవాలు అశ్విన్‌కి ఏ రకంగా ఉపయోగపడతాయో చూడాలి.