వంద సినిమాల చరిత్ర.. కె.రాఘవేంద్రరావుది. యాభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన చూడని ఎత్తు, పల్లాల్లేవు. తెలుగు సినిమాకి కొత్త కమర్షియల్ రంగు అద్దిన ఘనత ఆయనది. సౌందర్యలహరి ద్వారా… బుల్లి తెరపై ఆయన అనుభవాలు పంచుకొన్నారు. ఈటీవీలో ప్రసారమైన ఈ కార్యక్రమం సూపర్ హిట్టయ్యింది. ఇప్పుడు మరోసారి రాఘవేంద్రరావు బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. అయితే ఈసారి టీవీల్లో కాదు…ఆన్ లైన్ ప్రపంచంలో. కె.కె.ఆర్ క్లాస్ రూమ్స్ పేరిట ఆయన ఓ యూ ట్యూబ్ ఛానల్ మొదలెట్టారు. అందులో తన దర్శక ప్రయాణంలో జరిగిన సంఘటనల్ని, సంగతుల్ని పాఠాలుగా చెప్పబోతున్నారు. సహాయ దర్శకులుగా మారాలి అనుకొన్నవాళ్లకు, దర్శకులుగా ఎదగాలి అనుకొంటున్నవాళ్లకు ఆయన పాఠాలు చెబుతారన్నమాట. థీరీ, ప్రాక్టికల్ రెండూ ఉంటాయిందులో. జూన్ 10 (శుక్రవారం) నుంచి యూ ట్యూబ్ ఛానళ్లలో రాఘవేంద్రరావు పాఠాలు చూడొచ్చు.
ప్రతీ ఎపిసోడ్ 15 నుంచి 20 నిమిషాల పాటు సాగబోతోందని సమాచారం. ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో విభాగం గురించి రాఘవేంద్రరావు క్లాస్ తీసుకొంటారు. మరి ఈ పాఠాలు కుర్రకారుకి ఎంత వరకూ ఉపయోగపడతాయో, ఈ క్లాసులతో వాళ్లేం నేర్చుకోబోతున్నారో? ఓ సీరియర్ దర్శకుడు యూ ట్యూబ్ ద్వారా మాస్టారి అవతారం ఎత్తడం బహుశా ఇదే తొలిసారేమో. మరి ఈ ప్రయోగం ఎంత వరకూ విజయవంతం అవుతుందో చూడాలి.