ఎన్టీఆర్ ఆత్మకథని వెండి తెరపై తీసుకురావడానికి ఆయన వారసుడు నందమూరి బాలకృష్ణ కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ స్ర్కిప్టు తయారైందని, తగిన దర్శకుడి కోసం బాలయ్య అన్వేషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ స్క్రిప్టు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గరకు వెళ్లిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. `ఈ కథని మీలాంటి అనుభవజ్ఞులు చేస్తే బాగుంటుంది` అని బాలయ్య కోరాడట. అయితే.. రాఘవేంద్రరావు అందుకు సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ఎన్టీఆర్ – రాఘవేంద్రరావు మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలొచ్చాయి. సెట్లో ఎన్టీఆర్ ఎలా ఉండేవారు?? ఆయన పాత్రలో ఎలా పరకాయ ప్రవేశం చేసేవారు?? ఇలాంటి విషయాలు రాఘవేంద్రరావుకే బాగా తెలుసు. ఎందుకంటే… ఎన్టీఆర్‌తో పనిచేసి ఇప్పటికీ సినిమాలు చేస్తున్న దర్శకుడు ఆయనొక్కడే. దాసరి నారాయణరావుకీ ఆ అనుభవం ఉంది కానీ.. ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. దానికి తోడు .. డైరెక్షన్‌కి చాలా కాలంగా దూరంగా ఉన్నారాయన. అందుకే… ఈ ఛాన్స్ దర్శకేంద్రుడి దగ్గరకు వెళ్లిందట.
కానీ… రాఘవేంద్రరావు మాత్రం…”ఎన్టీఆర్ జీవిత కథని తెరకెక్కించడం అంత ఈజీ కాదు. చాలా శోధించాలి.. కత్తి మీద సాము..” అని చెప్పి… ఈ అవకాశాన్ని వదులుకొన్నట్టు తెలుస్తోంది. బాలయ్య ఇప్పుడు నవతరం దర్శకులకంటే అనుభవజ్ఞులైన దర్శకులకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టం అయ్యింది. ఒక దశలో… ఈ సినిమాకి తానే దర్శకత్వం వహించాలని అనుకొన్నార్ట. కానీ… దర్శకత్వం, నటన అంటే ఒత్తిడి పెరుగుతుందని ఆ ప్రతిపాదన నుంచి విరమించుకొన్నారని సమాచారం. మరి.. ఎన్టీఆర్ కథని డైరెక్ట్ చేసే… దర్శక ధీరుడు ఎవరో మరి.