రాఘవేంద్రరావు… నటుడిగా మేకప్ వేసుకుని తొలిసారి కెమెరా ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తనికెళ్ల భరణి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. `ఓ.. బాబూ` అనే పేరు పరిశీలనలో వుంది. ఈ చిత్రానికి దర్శకుడు భరణినే అయినా, దర్శకేంద్రుడి ఓల్డ్ స్కూల్ స్టైల్లోనే.. మేకింగ్ సాగబోతోందట.
ఇది వరకు మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే.. ఓ రేంజ్ లో ఉండేవి. దర్శకుడు, సంగీత దర్శకుడు, రచయిత, డాన్స్ మాస్టర్.. ఇలా వీళ్లంతా ఓ చోట కూర్చుని.. పాటలపై కసరత్తు చేసేవారు. ఇప్పుడు అలా లేదు. దర్శకుడు ఓ చోట.. సంగీత దర్శకుడు మరో చోట. గీత రచయిత ఇంకో చోట. వాళ్లంతా ఆన్ లైన్లో ముచ్చటించుకుని పాట పుట్టించేస్తున్నారు. కానీ.. `ఓ బాబూ` కోసం మాత్రం పాత రోజుల్లోకి వెళ్లిపోయింది చిత్రబృందం.
హైదరాబాద్ శివార్లలో ఓ రిసార్ట్ లో మూడు రోజుల పాటు మ్యూజిక్ సిట్టింగ్స్ నిర్వహించార్ట. ఆ సిట్టింగ్స్‌లో సినిమాకి సంబంధించిన ప్రధాన సాంకేతిక నిపుణులు, నటీనటులు అంతా కలిసి పాల్టొన్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూడురోజుల్లోనే ట్యూన్లన్నీ రెడీ చేసేశారని, అక్కడే… చంద్రబోస్ తో పాటలూ రాయించేశారని టాక్. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో `పెళ్లి సందడి` మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే. `పెళ్లి సందడి` అయ్యాకే.. `ఓ బాబూ` సెట్స్‌పైకి వెళ్తుంది. అయితే ఈలోగా.. పాటల పని పూర్తి చేయాలని భావిస్తున్నారు. రాఘవేంద్రరావు భార్యగా రమ్యకృష్ణ ఈ చిత్రంలో నటిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు.. ముగ్గురు స్టార్ హీరోయిన్లు కూడా ఈ సినిమాలో ఉంటార్ట. ఆ వివరాలన్నీ త్వరలోనే తెలుస్తాయి.