హైదరాబాద్: నడుము అనేది ఆడదానికి అందమైన ప్రదేశమని, అందాన్ని ఆరాధించటంకోసమే పూవులు కానీ, పండ్లు కానీ వేశానని సుప్రసిద్ధ దర్శకుడు రాఘవేంద్రరావు చెప్పారు. టీవీ 9 ఛానల్వారి ‘ఎన్కౌంటర్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, నడుం మీద పండ్లు, పూలు వేయటానికి కారణాన్ని వివరించారు. పండ్లు ఆడవాళ్ళ వంటిపై మరెక్కడ వేసినా నిలబడవని అన్నారు. విమానం రన్‌వే మీద ల్యాండ్ అవుతుంది తప్ప ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ అవుదని చెప్పారు. పళ్ళు స్టెడీగా నిలబడాలంటే అక్కడే వేయాలని వివరించారు. దీనిమీద ఎవరేమనుకున్నా తాను పట్టించుకోనని, ‘బొడ్డుమీద కాయ వేస్తాడు’ అని తన గురించి అందరూ అనుకుంటారని తనకు తెలుసని చెప్పారు. తనది గోల్డెన్ టచ్ అని హీరోయిన్లే చెబుతారని వారే తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని అడిగేవారని తెలిపారు. నడుమును తానే చూపించలేదని, ఆడవాళ్ళు ఎప్పటినుంచో బొడ్డుకిందకు చీరకట్టటం ప్రారంభించారని, టాటూ వంటి అలంకరణలుకూడా ఇప్పుడు చేస్తున్నారని చెప్పారు.
ఒక హీరోయిన్‌కు చాలా ఆస్తులు రాసిచ్చారన్న వాదనకు సమాధానమిస్తూ, అలా ఏమీ లేదని, ఒకరిద్దరు హీరోయిన్ వరస ఫ్లాప్స్‌లో ఉంటే తాను అవకాశం ఇచ్చానని, తద్వారా వారు మంచి రేంజ్లోకెళ్ళి డబ్బులు సంపాదించుకున్నారని అన్నారు. అంతే తప్ప తన దగ్గర ఆస్తులు రాసిచ్చేటంత ఆస్తులు లేవని చెప్పారు.
సినీ మ్యాక్స్ స్థలం వేరే పనికోసం ఇస్తే, దానిని వాణిజ్యపరంగా ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలపై మాట్లాడుతూ, ఆ స్థలాన్ని రికార్డింగ్ స్టూడియో నిర్మాణం కోసం ఎన్టీఆర్ 83లో ఇచ్చారని తెలిపారు. అయితే నిర్మాణం ప్రారంభించగానే కోర్ట్ కేసు వచ్చిందని, ఆ కేసు పదేళ్ళు నడిచిందని చెప్పారు. పదేళ్ళ తర్వాత కేసు వేసిన వ్యక్తి డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చి కేసును పరిష్కారం చేసుకున్నామని తెలిపారు. అయితే ఈ కాలక్రమంలో రికార్డింగ్ స్టూడియోకు కావలసిన స్థలం తగ్గిపోయిందని, ఇప్పుడు రికార్డింగ్ స్టూడియోకు కొద్ది స్థలం సరిపోతుందని, మిగిలిన స్థలంలో ధియేటర్లు కట్టుకుంటానని అనుమతి తీసుకుని ధియేటర్లు కట్టానని చెప్పారు. ఎన్టీఆర్ హైదరాబాద్‌లో స్టూడియో కట్టమని అడిగితే, చెన్నైలో తనకున్న రు.100 కోట్ల స్టూడియోను రు.3 కోట్లకు అమ్ముకుని ఇక్కడకు వచ్చానని అన్నారు.
తనకు వ్యాపారాలు చేయటం రాదని, అయితే జగదేకవీరుడు అతిలోకసుందరి దగ్గరనుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండటం ప్రారంభించానని తెలిపారు. నెలనెలా ఆదాయం వచ్చేలా చూసుకోవటం మొదలుపెట్టానని చెప్పారు. అప్పుడే చెన్నైలో మౌంట్ రోడ్లో టెంపుల్ టవర్స్ కట్టానని తెలిపారు. టీటీడీ సభ్యుడిగా తనకొక కోరిక ఉందని, శ్రీవారి దేవాలయంలో భక్తులు లక్షమంది వచ్చినా ఆరుగంటలు, ఏడు గంటలపాటు నిలుచోకుండా గంటలో దర్శనమయ్యేలా ఒక కొత్త విధానమేదైనా ప్రవేశపెట్టాలని అనుకుంటున్నానని చెప్పారు.