‘కేరాఫ్ కంచరపాలెం’… అందరూ కొత్తవాళ్లతో కొత్త దర్శకుడు వెంకటేశ్ మహా, కొత్త నిర్మాత విజయప్రవీణ పరుచూరి తీసిన చిన్న సినిమా. రానాతో పాటు అతడి తండ్రి, ప్రముఖ నిర్మాత సురేశ్ బాబుకు సినిమా నచ్చింది. ఇంకేముంది? చిన్న సినిమా దశ తిరిగింది. పెద్ద పెద్ద దర్శకులకు సినిమా చూపించారు. వాళ్లకూ నచ్చింది. దాంతో సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు. సినిమాకు బజ్ వచ్చింది. విడుదలైన తరవాత ప్రేక్షకులకూ నచ్చింది. వాళ్లూ ప్రశంసించారు. అయితే… ఈ వారం పెద్ద సినిమా ‘శైలాజారెడ్డి అల్లుడు’, పెద్ద స్టార్ హీరోయిన్ సమంత నటించిన ‘యూ టర్న్’ విడుదల అవుతున్నాయి. ఈ సినిమాల కోసం ఎక్కడ ‘కేరాఫ్ కంచరపాలెం’ను థియేటర్లలోంచి తీసేస్తారో? అని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆలోచించారు. “ఎలాగైనా సినిమాను బాగా ఆడించు. ఇటువంటి సినిమాలు ఆడితే ఇండస్ట్రీకి మంచిది. ఇటువంటి సినిమాలు ఆడాలి. అప్పుడే కొత్త కొత్త సినిమాలు వస్తాయి. త్వరలో పెద్ద సక్సెస్ ఫంక్షన్ చెయ్. దానికి నేను వచ్చి అందరికీ షీల్డులు ఇస్తా” అని సురేశ్ బాబుకు ఫోన్ చేశారు. ఈ రోజు జరిగిన ‘కేరాఫ్ కంచరపాలెం’ సక్సెస్ మీట్ లో సురేశ్ బాబు ఈ విషయాన్ని చెప్పారు. ఈతరం ప్రజలు ఫాస్ట్ ఫుడ్డుకు అలవాటు పడినట్టు… మాస్ కమర్షియల్ సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారని, మంచి సినిమాలు చూడటాన్ని మరచిపోయారని సురేశ్ బాబు అన్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాకు వస్తున్న స్పందన సంతోషంగా వుందని… అయితే ఈ స్పందనతో సంతోషంగా లేనని తెలిపారు. మరింత మంది సినిమా చూడాలని ఆయన కోరుకుంటున్నట్లు చెప్పారు.