నర్సాపురం వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. రాజీనామా చేసి అమరావతి ఎజెండాతో ఉపఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన చెబుతున్నారు. తనపై అనర్హతా వేటు వేయించడానికి వైసీపీ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.. వారికి ఎంత సమయం కావాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆ టైం తీసుకుని.. ఇక చేతకాదు అని చెబితే మరుక్షణం రాజీనామా చేస్తానని ఆయన అంటున్నారు. దీంతో రఘురామ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త సంచలనం అవుతున్నాయి.
ఇప్పటి వరకూ అధికారపక్షం ఆయనపై అనర్హతా వేటు వేయించాలని ప్రయత్నిస్తోంది. ఇటీవల ఆయన రాజీనామా చేయబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఆయన బీజేపీలోచేరుతారని.. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారని చెప్పుకున్నారు. ఈ లోపు హఠాత్తుగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటించారు. అయితే తాను రాజీనామా చేస్తానని ఎవరికీ చెప్పలేదని.. కానీ విన్నానని రఘురామ ఆ సందర్భంగా మీడియాతో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన మాటల్ని బట్టి చూస్తే… వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి .. అమరావతి ఎజెండాగా ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.
సాధారణంగా ఉపఎన్నికలు అంటే అధికార పార్టీకి అడ్వాంటేజ్‌గా ఉంటాయి. కానీ ఇప్పుడు నర్సాపురం స్థానానికి ఉపఎన్నికలను కోరుకునే పరిస్థితిలో వైసీపీ లేదని చెబుతున్నారు. ఈ విషయం గురించే తెలిసే రఘురామకృష్ణరాజు రాజీనామా అంశాన్ని లేవనెత్తారని భావిస్తున్నారు. ముందు ముందు ఈ అంశంలో వైసీపీ నేతలుసీరియస్గా ఉంటే ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉంది.