ఓ ఎంపీ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, చంపినంత పని చేశారని మొత్తుకున్న వినలేదు. లోక్ సభ ఎంపీగా ప్రజల ఓట్లతో గెలిచినా తన నియోజకవర్గానికి కూడా రానివ్వకుండా వేధించారు. కానీ ఆయన తన పోరాటం విడవకుండా రాజీలేని పోరాటం చేశారు. ఆయనే రఘురామ కృష్ణం రాజు.
ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామ… కేసు పెట్టారు. మాజీ సీఎం జగన్, ఆనాటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్, ఇంటలిజెన్స్ ఐజీ సీతారామాంజనేయులు, సీఐడీ డీఎస్పీ విజయపాల్ సహ పలువురిపై కేసు నమోదైంది.
అయితే, కేసు నమోదైన తర్వాత ఇటీవల పోలీసుల బదిలీలు జరిగిన నేపథ్యంలో… ఎమ్మెల్యే రఘురామ మరోసారి గుంటూరు ఎస్పీని కలిశారు. తాను చేసిన ఫిర్యాదుపై ఇప్పటికే ఎఫ్.ఐ.ఆర్ నమోదైనందున, విచారణలో స్పీడ్ పెంచాలని కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతి పత్రం ఇవ్వటంతో పాటు తన వద్ద ఉన్న ఆధారాలను కూడా మరోసారి సమర్పించారు.
నిజానికి ఈ కేసు నమోదైన వెంటనే కాలినొప్పి పేరుతో మాజీ సీఎం జగన్ బెంగుళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారని, పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయమే అసలు కారణం అన్న విమర్శలొచ్చాయి. కానీ, ఇప్పుడు జగన్ తిరిగి తాడేపల్లికి రావటం, ఎమ్మెల్యే మరోసారి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో… పోలీసులు జగన్ కు నోటీసు ఇచ్చి విచారణకు రమ్మంటారన్న అభిప్రాయం న్యాయ నిపుణుల్లో వ్యక్తం అవుతోంది.
మొదట అధికారులు, ఆ తర్వాత జగన్ కు పిలుపు ఉంటుందని… ఆ తర్వాత అరెస్టులుంటాయా? ఉండవా అనేది తేలుతుందంటున్నారు.