నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు భీకరమైన శపథం చేశారు. జగన్మోహన్ రెడ్డి కేసును తేల్చే వరకూ తాను ఏపీలో అడుగు పెట్టబోనని ప్రకటించారు. జగన్ రాముడో.. రావణుడో తేలేవరకు ఏపీలో కాలుపెట్టబోనని ప్రకటించారు. జగన్ బెయిల్ షరతులను ఉల్లంఘించారని ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ.. సీబీఐ కోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. అయితే పిటిషన్ ప్రొసీడింగ్స్ సరిగా లేవని.. సరైన డాక్యుమెంట్లు ఇవ్వాలని పిటిషన్‌ను సీబీఐ కోర్టు రిట్నర్ చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే.. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ప్రెస్ మీట్ పెట్టి రఘురామకృష్ణరాజుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన జైలుకెళ్లడం ఖాయమని హెచ్చరించారు.
ఆ తర్వాత రఘురామకృష్ణరాజు .. మీడియా సమావేశం పెట్టి తన చాలెంజ్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసి జైలుకెళ్లిన తర్వాతే తాను ఏపీలో అడుగుపెడతానన్నట్లుగా పరోక్షంగా సవాల్ చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసినందుకు తనను చంపే కుట్ర పన్నారని ఆరోపించారు. తన కోసం కడప బ్యాచ్‌ను దించాలనుకుంటున్నారని ప్రధానికి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. వైసీపీతో విబేధించినప్పటి నుండి రఘురామకృష్ణరాజు నర్సాపురం వెళ్లడం లేదు. ఆయన నర్సాపురం వస్తే అరెస్టులు చేయడానికి వీలుగా ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. ఎన్ని కేసులు నమోదయ్యాయో ఎవరికీ తెలియదు.
అయితే అరెస్టు చేయకుండా… రఘురామకృష్ణరాజు స్టే తెచ్చుకున్నారు. అయినప్పటికీ.. సొంత నియోజకవర్గానికి వెళ్లడానికి సంకోచిస్తున్నారు. ఇప్పుడు.. జగన్ బెయిల్ రద్దు చేసే మిషన్ ను పెట్టుకున్న ఆయన .. అది తేల్చుకున్న తర్వాతనే … ఏపీకి వస్తానని అంటున్నారు. మొత్తానికి రఘురామకృష్ణరాజు.. సొంత పార్టీ అధినేతపై భీకరమైన యుద్ధమే ప్రకటించారని అనుకోవాలి.