గూగుల్ టేక్ ఔట్ అనేది ఇప్పుడు పెద్ద టాపిక్ అయిపోయింది. వైసీపీ నేతలు ఈ గూగుల్ టేకౌట్ గురించి టేకిట్ ఈజీ అన్నట్లుగా మాట్లాడేస్తున్నారు. వారి ఆందోళనకు తగ్గట్లుగా ఇప్పుడు ఇతర నేతలు టార్గెట్ చేస్తున్నారు. తనను కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన వారిలో అప్పటి సీఐడీ చీఫ్ కూడా ఉన్నారని ఆరోపిస్తున్న రఘురామకృష్ణరాజు గూగుల్ టేక్ ఔట్ వాడి .. వివరాలు తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన… సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి సీఎస్ లేఖ రాయడాన్ని ప్రస్తావించారు.
సునీల్ కుమార్ కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడ్డారో లేదో.. గూగుల్ టేక్ ఔట్ వాడాలని.. అప్పుడు మొత్తం బయటపడుతుందని చెబుతున్నారు. సునీల్ కుమార్ తనపై స్వయంగా దాడి చేశారని రఘురామ అనుమానం. ముసుగులు వేసుకుని వచ్చి తనపై దాడి చేసిన వారిలో సునీల్ కుమార్ ఉన్నారని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అందుకే టెక్నాలజీ వాడాలంటున్నారు. మరో వైపు తనకు పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసిన తర్వాత సునీల్ కుమార్ అమెరికా వెళ్లిపోయారు. ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు కానీ ఆయనపై ఇక్కడ చర్యలు తీసుకోవడానికి వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి.
మూడున్నరేళ్ల పాటు సీఐడీ అధికారులపై అనేక ఆరోపణలు వచ్చాయి. కేసుల పేరుతో అనేక మందిని అర్థరాత్రి.. అపరాత్రి అనే తేడా లేకుండా అరెస్ట్ చేశారు. గోడలు దూకి.. తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్టులు చేశారు. కానీ ఇప్పటి వరకూ ఒక్క దాంట్లోనూ చార్జిషీటు దాఖలు చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్ష్యాలు ఉంటే ఎందుకు చార్జిషీట్లు దాఖలు చేయలేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. వాటన్నింటిపైనే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.